14 April, 2026 | 2:05 AM

15న అఖిలపక్ష సమావేశం

14-04-2026 12:15 AM
  1. మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలుపై విపక్షాల చర్చ
  2. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడి

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టనున్న మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుపై చర్చించేందుకు ఈ నెల 15న అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. న్యూఢిల్లీలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగనున్న ఈ సమావేశాన్ని తన అధికారిక నివాసం లేదా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహిస్తామని వివరించారు.

ఇలాంటి నిర్ణయాలపై లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పూర్తి మద్దతు ఇస్తోందని, తమ పార్టీ ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. పార్లమెంటులో ఏకగ్రీవంగా ఆమోదం పొందిన చట్టం ద్వారా బీజేపీ రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

మహిళలకు ప్రాతినిధ్యం కల్పించే విషయంలో తమకు ఎవరూ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థలు, పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ఇప్పటికే మహిళా రిజర్వేషన్లను కాంగ్రెస్ అమలు చేసిందని గుర్తు చేశారు. అఖిల పక్ష సమావేశం తర్వాత తమ పార్టీ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.

విపక్షాలన్నీ ఏకతాటి పైకి వస్తే ఉమ్మడి కార్యాచరణ కూడా ఉండవచ్చని అంచనా వేశారు. కేంద్ర ప్రభుత్వం అన్ని పార్టీలను పిలిచి చర్చకు అవకాశమిస్తే తాము సూచనలిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. కానీ, కేంద్రం మొండిగా ముందుకు వెళ్తున్నదని మండిపడ్డారు.