30 July, 2026 | 1:03 PM

వర్షాలు పట్ల ప్రజలందరూ అప్రమత్తం

30-07-2026 12:21 PM

మహా ముత్తారం,(విజయక్రాంతి): మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మహా ముత్తారం ఎస్ఐ రమేష్ సూచించారు. రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అత్యవసర పరిస్థితులు మినహా ప్రజలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా వాగులు, వంకలు, చెరువులు, నదులు, కల్వర్టులు, లో-లెవల్ బ్రిడ్జిల వద్దకు వెళ్లవద్దని సూచించారు. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాంతాల్లో ప్రయాణాలు చేయరాదని, ప్రజల భద్రత కోసం వరద ప్రభావిత ప్రాంతాలు, లో-లెవల్ బ్రిడ్జిల వద్ద జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోందని తెలిపారు.

అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్-100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ఎస్సై కోరారు. ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలో మునిగిన కల్వర్టులు, వంతెనలు దాటేందుకు ప్రయత్నించవద్దనిపశువులను మేతకు తీసుకెళ్లేటప్పుడు, వ్యవసాయ పనులకు వెళ్లేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని అలాగే విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండి సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని మహాముత్తారం ఎస్ఐ గోర్ల రమేష్ మండల ప్రజలకు  హెచ్చరిక చేశారు.