30 July, 2026 | 1:33 PM

అత్యవసర సమయాల్లో తప్ప బయటికి రావద్దు

30-07-2026 12:59 PM

పోలీసులకు, ప్రజలకు సూచనలు చేసిన ఎస్పీ అఖిల్ మహాజన్

ఆదిలాబాద్, (విజయక్రాంతి) : ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్పా భయటకు రావద్దని గురు వారం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కోరారు. రాష్ట్ర వాతావరణ శాఖ ఆదిలాబాద్ జిల్లాకు భారీ వర్షాలు సూచించిన దృష్ట్యా జిల్లా ప్రజలకు ఎటువంటి ప్రమాదం తలెత్తకుండా జిల్లా పోలీసు యంత్రంగా, డిడిఆర్ఎఫ్ (DDRF) బృందం 24 గంటలు అత్యాధునిక సదుపాయాలతో అందుబాటులో ఉన్నారన్నారు.

ప్రజలు అత్యవసర సమయాలలో తప్ప బయటకి రాకూడదని, అత్యవసర సమయంలో డయల్ 100 కు లేదా స్థానిక పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించాలని సూచించారు. నూతనంగా అందజేసిన అధునాతన పరికరాలతో డిడిఆర్ఎఫ్ బృందం జిల్లాలో 24 గంటలు అందుబాటులో ఉంటుందని, ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగకుండా కాపాడతారని, జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని పోలీస్ స్టేషన్లలో అప్రమత్తంగా ఉన్నారన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రత్యేక టెలి కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి జిల్లా పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. 

- భారీ వర్షాలు పడి వరదలు సంభవించినప్పుడు ప్రజలు కల్వర్టులను, బ్రిడ్జిలను దాటకుండా చూడాలి. 

- యువకులు అత్యుత్సాహంతో ఉదృతంగా ప్రవహిస్తున్న జలపాతాలు, వాగులు, కాలువలు, నదులు, రిజర్వాయర్లు, చెరువుల వద్దకు వెళ్లకుండా చూడాలి.

- జలాశయాలు, చెరువులు, వాగుల వద్ద మత్స్యకారులు, ప్రజలు చేపల వేటకు వెళ్లనీయవద్దు.

- వర్షం భారీగా ఉన్నప్పుడు రైతులు పొలాల్లో విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తలు వహించాలి, విద్యుత్ స్తంభాలను గాని, వైర్లను కానీ చేతులతో తాకకుండా ఉండాలి.

- ప్రజలు చెట్ల కింద, పాడైన పాత భవనాల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల పక్కన ఉండకుండా చూడాలి.

- ముఖ్యంగా విద్యార్థులు, పిల్లలు పాత భవనాలలో ఉండకుండా చూడాలి.

- ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జలపాతాలు, చెరువులు, కుంటలు, అలుగుల దగ్గర, ప్రధాన రహదారులపై ప్రవహించే వాగులు, వంకలు దగ్గర నీటి ప్రవాహం స్థితిగతులపై ముందస్తు సమాచారం తెలుసుకొని ప్రత్యక్షంగా వెళ్లి పోలీస్ అధికారులు పర్యవేక్షించాలి. తగు జాగ్రత్తలు తీసుకొని ప్రజల రాకపోకలను గమనించాలి.

- వాహనదారులు రోడ్లపై ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా వాహనాలు నడపాలని, నీటి ప్రవాహం, వర్షం వల్ల ఏర్పడిన గుంతలు వాహనదారులకు కనిపించక ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తగా వాహనాలని నడపాలి. ఇలాంటి ప్రదేశాలలో ప్రత్యేకంగా పోలీసు సిబ్బందిని, సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలి.

- అత్యవసర సమయంలో డయల్ 100 లేదా స్థానిక పోలీసులను సంప్రదించాలి.