calender_icon.png 9 February, 2026 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కీలక సాక్ష్యాలన్నీ భద్రం

09-02-2026 01:40:47 AM

  1. ఎఫ్‌ఎస్‌ఎల్‌లో అగ్నిప్రమాదంలో ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు దగ్ధం కాలేదు
  2. ఓటుకు నోటు పత్రాలు 2021లోనే కోర్టుకు అందజేశాం
  3. ఫోన్ ట్యాపింగ్ కేసు సాక్ష్యాలూ సురక్షితం.. నివేదికలు సిద్ధం
  4. నష్టాన్ని అంచనా వేస్తున్నాం.. యథావిధిగా ఎఫ్‌ఎస్‌ఎల్ సేవలు
  5. దుష్ర్పచారాన్ని నమ్మవద్దు : డైరెక్టర్ శిఖాగోయల్

హైదరాబాద్, సిటీ బ్యూరో ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): నాంపల్లిలోని తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ(ఎఫ్‌ఎస్‌ఎల్)లో శనివారం సంభవించిన అగ్నిప్రమా దంపై సోషల్ మీడియాలో, కొన్ని మీడియా వర్గాల్లో వస్తున్న వార్తలను ఎఫ్‌ఎస్‌ఎల్ డైరెక్టర్ శిఖాగోయల్ తీవ్రంగా ఖండించారు. ఈ ప్రమాదంలో కీలక కేసులకు సంబంధించిన సాక్ష్యాలు కాలిపోయాయన్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని, అన్ని మెటీరియల్ ఆబ్జెక్టులు అత్యంత సురక్షితంగా ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. ఆదివారం ఈ మేరకు ఆమె హైప్రొఫైల్ కేసుల స్థితిగతులపై పూర్తి వివరాలను వెల్లడించారు.

ఓటుకు నోటు పత్రాలు ఇక్కడ లేవు

రాష్ర్టంలో సంచలనం సష్టించిన ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఆధారాలు ఈ ప్రమాదంలో కాలిపోయాయన్న ప్రచారాన్ని శిఖాగోయల్ కొట్టిపారేశారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం 16 మెటీరియల్ ఆబ్జెక్టులను 2015లోనే ఎఫ్‌ఎస్‌ఎల్ పరిశీలిం చింది. వాటికి సంబంధించిన నివేదికలను అప్పుడే కోర్టుకు సమర్పించాం. తదనంతరం, మార్చి 2021లోనే ఆ సాక్ష్యాలన్నిం టినీ తిరిగి ఏసీబీ ప్రత్యేక కోర్టుకు అప్పగించాం. ప్రస్తుతం ఎఫ్‌ఎస్‌ఎల్‌లో ఆ కేసుకు సంబంధించిన ఒక్క పత్రం కూడా లేదు అని ఆమె వివరించారు.

ఫోన్ ట్యాపింగ్ సాక్ష్యాలూ సురక్షితం..

మరో కీలకమైన ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి వివరిస్తూ.. ఈ కేసులో 2024 మార్చి నుంచి 2026 జనవరి వరకు అందిన 136 మెటీరియల్ ఆబ్జెక్టులలో 129 ఐటమ్స్‌పై ఇప్పటికే విశ్లేషణ పూర్తయి నివేదికలు అందజేశామని తెలిపారు. ఇటీవల జనవరిలో అందిన చివరి 7 ఐటమ్స్‌పై కూడా పరిశీలన పూర్తయిందని, వాటి నివేదికలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ఈ కేసులోని సాక్ష్యాలన్నీ భద్రంగా స్వాధీనం చేసుకున్నామని, ఎటువంటి నష్టం జరగలేదని స్పష్టం చేశారు.

అసలేం జరిగింది?

శనివారం ఉదయం 10:08 గంటలకు కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పొగలు రావడాన్ని సిబ్బంది గుర్తించారు. భవనంలోని స్మోక్ అలారమ్స్ వెంటనే మోగడంతో అప్రమత్తమైన సిబ్బంది ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక యంత్రాలు సకాలంలో చేరుకుని మధ్యాహ్నం 1:30 గంటలకు మంట లను అదుపులోకి తెచ్చాయి. ఈ ప్రమాదం లో మొదటి అంతస్తులోని ట్రైనింగ్ హాల్, కంప్యూటర్ ల్యాబ్‌లోని కొన్ని సదుపాయాలు దెబ్బతిన్నాయని, అయితే ఎటువం టి ప్రాణనష్టం లేదా గాయాలు కాలేదని డైరెక్టర్ తెలిపారు.

నాంపల్లి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని శిఖాగోయల్ తెలిపారు. ప్రస్తుతం ఎఫ్‌ఎస్‌ఎల్ సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయని, దెబ్బతిన్న విభాగాలను త్వర లోనే పునరుద్ధరిస్తామని చెప్పారు. ‘మేము అత్యున్నత వృత్తిపరమైన ప్రమాణాలను పాటిస్తాం. ఆధారాల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. మీడియా ప్రతినిధులు, ప్రజలు నిరాధారమైన వార్తలను ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని ఆమె పేర్కొన్నారు.