09-02-2026 01:28:21 AM
టీడీపీ పొత్తు సీపీఐకి లాబించేనా?
మూడుముక్కలాటగా బీఆర్‌ఎస్
కరెన్సీ వైపు ఓటర్ చూపు...
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 8 ,(విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ తొలి ఎన్నికల్లో రాజకీయ పార్టీల తీరు రోత పుట్టిస్తుందని విమర్శలు వినిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు సిపిఐ అభ్యర్థికి ఓటు వేయమని ఓటర్ను బతిలాడారు, ప్రస్తుత కార్పొరేషన్ ఎన్నికల్లో అదే కాంగ్రెస్ నాయకులు సిపిఎం అభ్యర్థికి ఓటు వేయాలని అభ్యర్థించడం పట్ల ఓటర్లు మండిపడుతున్నారు.
పాల్వంచ ,కొత్తగూడెం, సుజాతనగర్ మండలంలోని ఏడు పంచాయతీలను కలుపుతూ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ గా 60 డివిజన్లతో నూతనంగా ఏర్పాటు చేశారు. అనేక నాటకీయ పరిణామాల మధ్య కోర్టు తీర్పుతో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఐ బిజెపి, బిఆర్‌ఎస్, జనసేన పార్టీలో అభ్యర్థులు బరిలో ఉన్నారు. అధికార కాంగ్రెస్, సిపిఐ పార్టీల మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. కాంగ్రెస్, సిపిఎంతో , సిపిఐ పార్టీ తెలుగుదేశంతో కూటమిలుగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులకు రాష్ట్రంలో సైకిల్ గుర్తు లేకపోవడంతో కంకి కొడవలి గుర్తుపైన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మూడో స్థానంలో బిఆర్‌ఎస్ ఉంది. బిజెపి, జనసేన పార్టీలు పోటీలో ఉన్నప్పటికీ చెప్పుకోదగ్గ ప్రభావం చూపడం లేదు. పాల్వంచ డివిజన్ పరిధిలోనే ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది . కొత్తగూడెం డివిజన్లో ఎన్నికల ప్రభావం పెద్దగా చూపడం లేదు.
బియ్యం, భూముల పుష్పాలకు సీట్లు?
అధికార కాంగ్రెస్ పార్టీ డివిజన్లో ఎంపిక చేసిన కార్పొరేటర్ అభ్యర్థులు ఎంపికలు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పార్టీకి పతార పెంచే కార్యకర్తలను కాదని కరెన్సీ ఉన్నవారికి సీట్లు కేటాయించారని సొంత పార్టీ నాయకులే ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 58 స్థానాల్లో, సిపిఎం పార్టీ రెండో స్థానాల్లో పోటీలో ఉంది. ఎంపికైన అభ్యర్థులు చౌక బియ్యం అమ్ముకొని కేసుల పాలైన వారు, భూ వివాదంలో తలమునకై ఉన్నవారికి సీట్లు కేటాయించారని ఆరోపణలు వస్తున్నాయి.
అంతేకాకుండా ఏనాడు బయట ప్రపంచం తెలియని మహిళా అభ్యర్థులకు, కాంట్రాక్టర్లకు వ్యాపారస్తులకు సెట్లు కేటాయించడంతో కాంగ్రెస్ క్యాడర్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. సీట్ల కేటాయింపులో జరిగిన అన్యాయం పై ఏకంగా ఏఐసిసికి ఫిర్యాదు చేశారంటే స్థానిక కాంగ్రెస్ నాయకత్వం పనితీరు ఎలా ఉందో చెప్పనవసరం లేదు. ఎన్నికల ఇన్చార్జులుగా వలస నాయకులకు పెత్తనం పార్టీకి తీరని నష్టం వాటిలిం దని కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నామమాత్రపు ప్రచారం సాగడంతో అభ్యర్థుల గెలుపు కొంత ఇబ్బందిగా మారిందని తెలుస్తోంది.
తెలుగుదేశం పొత్తు సిపిఐకి లాభం చేయనా?
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మద్దతు కొత్తగూడెం ఎమ్మెల్యేగా సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు గెలుపొందారు. కొత్తగూడెం నియోజకవర్గం అంటేనే కాంగ్రెస్ కంచుకోట, సాంప్రదాయ ఓట్లకు నిలయం. అలాంటి స్థానాన్ని సిపిఐ కి కేటాయించడంతో కాంగ్రెస్ కేడారు డీలపడ్డారు. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో అధికారం ఉన్న, కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల పరిస్థితి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూనే వచ్చారు. పంచాయతీ ఎన్నికల నాటి నుంచి కాంగ్రెస్, సిపిఐ పార్టీల మధ్య పొత్తు చెడి దూరం విపరీతంగా పెరిగింది.
కార్పొరేషన్ ఎన్నికల్లో రెండు పార్టీలు ఐసికి.. తైసి అంటున్నాయి. కాంగ్రెస్ దూరం కావడం, దీనికి తోడు తెలుగుదేశం పార్టీతో సిపిఐ పొత్తు పెట్టుకున్న సైకిల్ గుర్తు లేకపోవడంతో తెలుగు తమ్ముళ్లు తీవ్ర నారాజ్ అవుతున్నారు. కంకి కొడవలి గుర్తుపై ఓటు వేస్తారా, లేదా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఈ పొత్తు సిపిఐ కి ఏ మేరకు లాభం చేకూరుస్తుందో వేచి చూడాలి. ఎట్టకేలకు కొత్తగూడెం కార్పొరేషన్ పై సిపిఐ జెండా ఎగరవేయాలని పట్టుదలతో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు శక్తివంచన లేకుండా పోరాడుతున్నారు. ఆయన శ్రమ ఫలించెనా అనేది వేచి చూడాలి.
మూడు ముక్కలాటగా బిఆర్‌ఎస్...
10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న భారతీయ రాష్ట్ర సమితి పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుంది. ఆ పార్టీలో నాయకుల తీరు ఎవరికి వారే యమునా తీరే అన్న చందాన ఉంది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావుకు, నియోజకవర్గం ఇన్చార్జి వనమా వెంకటేశ్వరరావుకు మధ్య పచ్చ గడ్డి వేస్తే బగ్గు మనే అభిప్రాయ భేదాలు ఉన్నాయి. రెండో వర్గాలను సమన్వయం చేసేందుకు ప్రయత్నిస్తున్న ఎంపీ వరదరాజు రవిచంద్ర ప్రయత్నాలు పారినట్లుగా లేవు. దీంతో ఎవరి దారి వారు ప్రచారం చేసుకుంటూ పోతున్నారు. పరిస్థితి వారికి మూడో స్థానం తప్పదు అన్నట్లుగా నెలకొంది.
ప్రభావం చూపని బిజెపి, జనసేన
జాతీయ పార్టీలుగా పేరుందిన భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ అభ్యర్థులు సైతం కార్పొరేషన్ ఎన్నికల బరిలో ఉన్నారు. అభ్యర్థుల ప్రచారం అంతంత మాత్రముగా సాగుతోంది. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి కార్పొరేషన్ సీట్లను కాంగ్రెస్ బిఆర్‌ఎస్లకు అమ్ముకున్నాడని, బిజెపి క్యాడర్ కు తీవ్ర అన్యాయం జరిగిందంటూ అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు మాత్రమే కష్టపడుతున్నారు, నాయకుల జాడ కనిపించడం లేదు. ఈ ఎన్నికల్లో వారి ప్రభావం పెద్దగా లేదని చెప్పవచ్చు.
ఓటరు చూపు కరెన్సీ వైపు. ..
రాజకీయ పార్టీల తీరు ఒకలాగా ఉంటే, ఓటర్ దేవుళ్ళు మాత్రం కరెన్సీ వైపు చూస్తున్నారు. ఏ పార్టీ ఎంత ఇస్తుంది, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికి ఓటు వేస్తాం అన్నట్లుగా ఉంది వారి తీరు. ఇప్పటికే ఓటు విలువ రూ 3వేల నుంచి రూ 5వేలు వరకు పగులు పలుకుతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. అభ్యర్థులు మాత్రం ర్యాలీ, ఆచారాల్లో కూలీలను నియమించుకొని ఇంటింటి ప్రచారం చేస్తున్నారు.
ఒక్కొక్కరికి రోజుకు రూ 400 కూలి చెల్లిస్తూ ఒక పూట భోజనం ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల పుణ్యమా అంటూ కొందరికి మంచి ఉపాది లభించిందని చెప్పక తప్పదు. చివరకు ఓటర్ మహాశయులు ఏ పార్టీకి పట్టం కడతారో అనేది అభ్యర్థులు ఇచ్చే కరెన్సీ పైనే ఆధారపడి ఉందని చెప్పక తప్పదు.