2 September, 2026 | 1:44 AM

గురువుపై ఆరోపణల అసలు కథేంటి?

02-09-2026 | 12:00am

తెర వెనుక అసలేం జరిగింది?

ఉపాధ్యాయుడిని కాపాడేందుకు ప్రయత్నాలు జరిగాయా..? 

జిల్లా అధికారులు చర్యలు తీసుకునేంతగా అసలు ఏం జరిగింది..?

పాపన్నపేట, సెప్టెంబర్1: గురువు అంటే జ్ఞానం.. గురువు అంటే మార్గదర్శనం.. గురువు అంటే భరోసా.. కానీ అదే గురువుపై విద్యార్థినులకు సంబంధించిన తీవ్ర ఆరోపణలు రావడంతో పాపన్నపేటలో చర్చకు దారితీసింది. విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ఉపాధ్యాయుడిపైనే ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది.

ఈ వ్యవహారంలో అసలు ఏం జరిగింది..? ఆరోపణలు ఎలా వెలుగులోకి వచ్చాయి..? విషయం అధికారుల దృష్టికి వెళ్లిన తర్వాత ఏం జరిగింది..? మరో మండలానికి చెందిన పీజీహెచ్‌ఎం ఈ వ్యవహారంలో ఎందుకు జోక్యం చేసుకున్నారు..? ఉపాధ్యాయుడిని ఆరోపణల నుంచి బయటపడేయడానికి ఏమైనా ప్రయత్నాలు జరిగాయా..? అన్న ప్రశ్నలు ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.

అవగాహన కార్యక్రమం.. బయటపడిన బండారం

ఆగస్టు 7న జీసీఈసీ కార్యక్రమంలో భాగంగా మహిళా ఉపాధ్యాయులచే విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం జరిగింది. దీంతో ఉపాధ్యాయుడి వ్యవహారానికి సంబంధించి కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయం సంబంధిత హెల్ప్లైన్కు ఫిర్యాదు రూపంలో వెళ్లడంతో వ్యవహారం అధికారుల దృష్టికి చేరింది.

విద్యార్థినుల భద్రతకు సంబంధించిన విషయం కావడంతో అధికారులు దీనిని సీరియస్గా తీసుకున్నారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టడంతో పాటు, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకున్నారు. అయితే ఇంతకీ విచారణలో ఏం తేలింది..? ఏ అంశాలను అధికారులు పరిగణనలోకి తీసుకున్నారు..? చర్యలకు దారితీసిన పరిస్థితులు ఏమిటి..? అన్నవిషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.

పీజీహెచ్‌ఎంలు ఎందుకు రంగంలోకి వచ్చారు?

ఈ వ్యవహారంలో మరో మండలానికి చెందిన పీజీహెచ్‌ఎం పాత్రపై కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడికి అనుకూలంగా ఆయన ఎవరిని సంప్రదించారు..? అధికారులతో మాట్లాడారా..? వ్యవహారాన్ని సద్దుమణిగించే ప్రయత్నం చేశారా..? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

అసలు ఆయనకు ఈ వ్యవహారంతో సంబంధం ఏమిటి?

ఎవరి కోసం జోక్యం చేసుకున్నారు..?

ఎవరితో సంప్రదింపులు జరిపారు..?

ఏమైనా రాజీ ప్రయత్నాలు జరిగాయా..?

ఈ ప్రశ్నలకు సమాధానాలు లభించాల్సి ఉంది. అయితే పీజీహెచ్‌ఎం పాత్రకు సంబంధించిన ఆరోపణలు నిజమా కాదా అన్నది అధికారికంగా తేలాల్సి ఉంది.

తెరవెనుక ఏం జరిగింది?

ఘటన వెలుగులోకి రావడం నుంచి జిల్లా అధికారులు చర్యలు తీసుకునే వరకు జరిగిన పరిణామాలపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. విషయం బయటకు వచ్చిన వెంటనే ఎవరెవరు స్పందించారు..? ఎవరెవరు రంగంలోకి దిగారు..? ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి..? అన్నది పూర్తి స్థాయిలో వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది. ఒకవైపు విద్యార్థినుల భద్రత.. మరోవైపు ఉపాధ్యాయుడిపై వచ్చిన ఆరోపణలు.. ఇంకోవైపు ఈ వ్యవహారంలో ఇతరుల జోక్యం ఉందన్న చర్చ.. వెరసి అసలు కథ ఏమిటన్నది మిస్టరీగా మారింది.

జిల్లా అధికారులు చర్యలు తీసుకునేంతగా ఏం జరిగింది?

ఉపాధ్యాయుడిపై జిల్లా స్థాయి అధికారులు చర్యలు తీసుకున్నారంటే, దానికి దారితీసిన కారణాలు ఏమిటన్నది సహజంగానే ప్రశ్నగా మారుతోంది. విచారణలో ఏ అంశాలు నిర్ధారణ అయ్యాయి..? విద్యార్థినుల నుంచి ఎలాంటి సమాచారం సేకరించారు..? సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలు తీసుకున్నారా..? చర్యలకు ఆధారాలేమిటి..? అన్న విషయాలను అధికారులు వెల్లడిస్తే అనేక అనుమానాలకు తెరపడే అవకాశం ఉంది.

నిజం నిగ్గుతేలాలి.. న్యాయం జరగాలి

విద్యార్థుల భద్రత విషయంలోఎలాంటి రాజీ ఉండకూడదు. అదే సమయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై కూడా నిష్పక్షపాత విచారణ జరగాలి. నిజం ఏదైనాసరే.. అది వెలుగులోకి రావాల్సిందే. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చట్టపరమైన, శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఆరోపణలు నిరాధారమని తేలితే ఆ విషయాన్ని కూడా అధికారికంగా వెల్లడించాలి.