అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి
ములకలపల్లి,ఏప్రిల్ 14 (విజయక్రాంతి): అణగారిన వర్గాల సాధికారత, సామాజిక న్యాయం కోసం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పోరాడారని సీతారాంపురం సర్పంచ్ కుంజా రవి అన్నారు. మంగళవారం సుబ్బనపల్లి గ్రామంలోని సీతారాంపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నప్పటి నుంచే కులవివక్షతను ఎదుర్కొన్నప్పటికీ కష్టపడి చదివి ఉన్నత విద్యను అభ్యసించారని తెలిపారు.భారత రాజ్యాంగాన్ని రూపొందించిన ముఖ్య నాయకుడని అందుకే ఆయనను'భారత రాజ్యాంగ శిల్పి' అని పిలుస్తారని తెలిపారు.
భారత ప్రభుత్వం ఆయనకు అత్యంత ఉన్నత పురస్కారమైన భారతరత్న ఇచ్చి గౌరవించిందని గుర్తు చేశారు. అంబేడ్కర్ దళితులు,ఆది వాసులు,ఇతర వెనుకబడిన తరగతుల,అణగారిన వర్గాల విద్య,సాధికారత కోసం,సామాజిక ఆర్ధిక అసమానతలను పరిష్కరించడంలో సాధికారత సాధనంగా విద్యపై ఆయన దృష్టి సారించారని,విద్య ద్వారానే మనిషి ఎదుగుదల సాధ్యమని నిరూపించిన వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు.రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు,అంటరానితనం నిర్మూలన,రిజర్వేషన్లకు సంబందించిన నిబంధనలు ఉండే విదంగా చూశారని వివరించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సున్నం దావీదు,వార్డు సభ్యులు,పంచాయతీ కార్యదర్శి కందుకూరి రాంబాబు, హౌసింగ్ ఏఈ శ్రీధర్,వైద్య,అంగన్వాడి, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






