ప్రై‘వేటు’ వేయలేరా?
- ఆగని ఫీజులు దోపిడీ
- పుస్తకాల అమ్మకంలో అదే తీరు..
- ఎల్ కే జీకి రూ.50 వేల పైనే పీజు
- అర్హత లేని ఉపాధ్యాయులతో బోధనలు
- మొద్దు నిద్రలో విద్యాశాఖాధికారులు ఆగని ఆగడాలు కనిపించని చర్యలు
- విద్యార్థుల తల్లిదండ్రులకు తప్పని ఆర్థిక ఇబ్బందులు
- ప్రైవేటు పాఠశాలల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని వేడుకోలు
సంస్థాన్ నారాయణపూర్/చౌటుప్పల్, జూన్ 28 : జూన్ నెల మొదలైందంటేనే విద్యార్థుల తల్లిదండ్రుల గుండెల్లో గుబులు మొదలవుతుంది. తమ పిల్లలను నాణ్యమైన చదువు చదివించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలనేది ప్రతి తల్లిదండ్రుల కల.
కానీ నేడు ప్రైవేటు పాఠశాలల ఫీజుల గురించి తలుచుకుంటే కొంతమంది తల్లిదండ్రుల కల కలగానే మిగిలిపోతుంది. కాయకష్టం చేసి తమ పిల్లలను మంచి పాఠశాలలకు పంపాలనుకునే తల్లిదండ్రులకు కన్నీరే మిగులుతుంది. దీంతో ప్రైవేటు పాఠశాలల ఆగడాలపై శాఖాధికారులు రేటు వేయలేరా అనే ప్రశ్నలు స్థానికంగా వెలువెత్తుతున్నాయి.
పుట్టగొడుగుల్లా ప్రైవేటు పాఠశాలలు
పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే విద్య నేడు వాణిజ్య ఆదాయ వనరుగా మారింది. అనుభవం లేని ఉపాధ్యాయులతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారుతుంది. ఇబ్బడి మబ్బడిగా పుట్టగొడుగుల్లా వెలిసిన ప్రైవేటు పాఠశాలల్లో విద్య సామాన్యునికి అందని ద్రాక్షగా మారింది.
ప్రముఖుల అండదండలతో..
ప్రముఖ రాజకీయ నాయకుల అండదండలతో పాఠశాలలు నడుస్తున్నాయని ప్రజల ఆరోపణ. ఏవైనా సమస్యలున్నాయంటూ విద్యార్థుల తరపున నిలదీస్తే కేసులు పెడతామంటూ బెదిరింపులకు పాల్పడడం ఇందుకు ఉదాహరణ. ఇందులో కొంతమంది పోలీసులు జోక్యం చేసుకుంటూ పాఠశాలల వద్ద ఎలాంటి ఆందోళన జరగకుండా చూస్తుండడంతో పాఠశాల యజమాన్యం వద్ద పోలీసులు కూడా డబ్బులు తీసుకుంటున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు చౌటుప్పల్ పట్టణంలోని ట్రినిటీ స్కూల్ వద్ద జరిగిన సంఘటన నిదర్శనం.
నియంత్రణ లేని ఫీజులు..
ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల వసూలుకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఎల్ కే జీ విద్యార్థుల నుండి రూ.50 వేల నుండి 70 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇక పదవ తరగతి విద్యార్థులకు అక్షరాల రూ.2 లక్షల పై మాటే.. అధునాతన సాంకేతికతతో, విలువలతో కూడిన విద్యను బోధిస్తామంటూ పైపైన మెరుగులతో విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద భారీగా డబ్బు వసూలు చేస్తున్నారు. ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందంటూ చెబుతున్న విద్యాశాఖ అధికారుల మాటలు కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.
అర్హత లేని ఉపాధ్యాయులు..
దాదాపుగా ప్రవేట్ పాఠశాలల్లో ఎలాంటి అర్హత అనుభవం లేని ఉపాధ్యాయులను బోధనకు ఉపయోగిస్తూ విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో నెడుతున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇంటర్, డిగ్రీ ఫెయిల్ అయిన వారు ఉపాధ్యాయులుగా తమ పిల్లలకు ఏం బోధిస్తారని తల్లిదండ్రులు స్కూలు యజమాన్యం వద్ద వాపోతున్నారు. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ అర్హత లేని ఉపాధ్యాయుల బోధనలతో తమ పిల్లల భవిష్యత్తును ఆగం చేస్తున్నారనేది వారి వాదన.
సామాన్యునిపై పెనుబారం.!
పిల్లల భవిష్యత్తు కోసం కలలుగనే సామాన్యుని పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారింది. రోజువారి కూలీ చేసుకుని కుటుంబాన్ని పోషిస్తూ పిల్లలను పాఠశాలకు పంపేవారు అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారు. దీంతో ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులను నియంత్రించి తమను ఆదుకోవాలని ఆయా పాఠశాలలకు పిల్లల పంపే తల్లిదండ్రులు కోరుతున్నారు.
అధిక ఫీజులు వసూలు చేసే పాఠశాలలను సీజ్ చేయాలి
‘చౌటుప్పల్, నారాయణపురం మండలాల్లో ప్రైవేటు స్కూళ్లలో అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. పాఠశాలలో అధిక ధరలకు పుస్తకాలు అమ్ముతూ తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటి పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలి. ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే ప్రైవేటు పాఠశాలు నడుస్తున్నాయి. అధికారులు నిష్పక్షపాతంగా పనిచేస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు కృషి చేయాలి‘.
- తిగుళ్ల శ్రీనివాస్,
ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి, చౌటుప్పల్
అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవు
‘ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే విషయం మా దృష్టికి రాలేదు. స్కూల్ ఆవరణలో పుస్తకాలు అమ్మితే గుర్తింపు రద్దు చేస్తాం. అధిక ఫీజులు వసూలు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం.
- గురువారావు , ఎంఈఓ చౌటుప్పల్






