14 April, 2026 | 4:40 PM

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

14-04-2026 01:29 PM

మంగపేట,(విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలను మంగళవారం ములుగు జిల్లా మంగపేట మండల వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు.  అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మండలంలోని కమలాపురం, మంగపేట, తిమ్మంపేట, రాజపేట, అకినేపల్లి మల్లారం గ్రామాలలోని అంబేద్కర్ విగ్రహాలకు వివిధ దళిత సంఘాల, యువజన సంఘాల, రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

మండల కేంద్రమైన మంగపేటలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలకు ముఖ్య అతిధులుగా విచ్చేసిన మంగపేట ఎస్సై టి.వి.ఆర్.సూరి, రెండవ ఎస్సై శ్రీకాంత్ లు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని, రాజ్యాంగం కల్పించిన హక్కులను పొందడంతో పాటు ప్రతీ ఒక్కరూ తమ భాధ్యతలను కూడా గుర్తించాలన్నారు. అంబేద్కర్ చేసిన సేవలు మరువలేనివన్నారు. ఆయన చూపిన బాటలో ప్రతీ ఒక్కరూ నడవాల్సిన అవసరముందన్నారు. తన జీవితాన్ని పేదల కోసం త్యాగం చేసి, వారి అభ్యున్నతికి అనుక్షణం పరితపించిన మహానీయుడు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ అని కొనియాడారు. మండల వ్యాప్తంగా జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలలో వివిధ దళిత సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు , యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.