calender_icon.png 18 June, 2025 | 1:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికా అధ్యక్ష యుద్ధం

30-08-2024 12:48:57 AM

అగ్రరాజ్యం అమెరికా త్వరలో కొత్త అధ్యక్షుడ్ని ఎన్నుకోబోతోంది. నవంబర్ 5న అక్కడ కొత్త అధ్యక్షుడి ఎన్నిక కోసం పోలింగ్ జరగనుంది.  దాదాపు ఏడాది క్రితమే అమెరికాలో అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన ప్రక్రియ మొదలైంది. ప్రధాన పార్టీలయిన డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీల తరఫున అధ్యక్షఅభ్యర్థులుగా ఎవరు పోటీ చేస్తారనే దానిపై వివిధ రాష్ట్రాల్లో ఆయా పార్టీల డెలిగేట్ల మద్దతు కూడగట్టడం మొదలైంది. గత ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో ఓటమి పాలయిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించడం, అధికారంలో ఉన్న డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మళ్లీ పోటీకి సిద్ధం కావడంతో ఈ ఇద్దరి మధ్యనే  మరోసారి పోటీ తప్పదని భావించారు.

అయితే 81 ఏళ్ల వయసులో జో బైడెన్  మరోసారి అధ్యక్ష బరిలో నిలవడం అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారింది. వయసుతో పాటుగా పెరిగిన ఆయన మతిమరుపు పార్టీ విజయావకాశాలను దెబ్బతీసేలా కనిపించింది. అదే సమయంలో ట్రంప్ దూకుడు రిపబ్లికన్ పార్టీలో ఆయనను తిరుగులేని నాయకుడిగా నిలబెట్టింది.దీనికి తోడు ఎన్నికల సభలో ట్రంప్‌పై జరిగిన కాల్పులు కూడా ఆయన పాపులారిటీని విపరీతంగా పెంచేసింది. దీంతో ఈ సారి బైడెన్ ఓటమి ఖాయమనే అందరూ భావించారు. అయితే మాజీ అధ్యక్షులు బిల్‌క్లింటన్, బరాక్ ఒబామా సహా డెమోక్రటిక్ పార్టీకి చెందిన పలువురు నేతలు బైడెన్ తప్పుకుని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను అభ్యర్థిగా ప్రకటించాలంటూ తెచ్చిన ఒత్తిడికి తలొగ్గి బైడెన్ రేసునుంచి తప్పుకుని కమలకు మద్దతు ప్రకటించారు.

జులై చివర్లో బైడెన్ నిర్ణయం వెలువడినప్పటినుంచీ ఒక్కసారిగా ఎన్నికల సీన్ మారిపోయింది. 78 ఏళ్ల వృద్ధుడు ట్రంప్ పాలనను ఒకసారి చూసిన ప్రజలు ఆయనకన్నా  వయసులో18 ఏళ్ల చిన్న అయిన హారిస్ తమ దేశాన్ని పాలించడానికి సరయిన వ్యక్తి అని భావించడం మొదలు పెట్టారు. పోల్‌స్టర్ అంచనాలను బట్టి ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య తేడా దాదాపు 3 శాతం మాత్రమే ఉండగా కమలవైపే ఆ మేరకు మొగ్గు ఉంది. ప్రచారంలో సైతం కమల ట్రంప్ విమర్శలను దీటుగా తిప్పి కొడుతున్నారు.

అయితే గత నాలుగేళ్ల బైడెన్ పాలనలో దేశంలో పెరిగిపోయిన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, వలస సమస్యలు, మధ్యప్రాచ్యం, ఉక్రెయిన్‌లో అశాంతి లాంటి అంశాలను ట్రంప్ తన ప్రచారాస్త్రాలుగా చేసుకోవడంతో పాటు తన ప్రత్యర్థి కమలా హారిస్‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. అయితే ఆ ప్రచారమే కమలకు కలిసి వస్తోందని  రాజకీయ విశ్లేషకులు అంచనా. దీనికి తోడు ట్రంప్‌పై న్యాయస్థానాల్లో ఉన్న కేసులులాంటివి పార్టీలో ఆయన పట్ల వ్యతిరేకతను రోజురోజుకు పెంచుతున్నాయి..‘ మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ అన్న నినాదంతో ఓటర్లను ఆకట్టుకోవడానికి ట్రంప్ ప్రయత్నిస్తుండగా, ‘ వెన్ వుయ్ ఫైట్.. వుయ్ విన్’ అన్న నినాదంతో పోరాడితే పోయేదేమీ లేదంటూ పార్టీ కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపుతున్నారు హారిస్. అమెరికా ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థులు ఇచ్చే నినాదాలకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. 

కాగా ఈసారి ఎన్నికల్లో  భారతీయ సంతతి ఓటర్లు, ముస్లిం ఓటర్లు అత్యంత కీలకం కానున్నారు.  భారతీయ మూలాలున్న కమలా హారిస్ బరిలో ఉండడంతో భారతీయుల మద్దతు ఆమెకే ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు ముస్లిం ఓటర్లు ఈ సారి ఏ పార్టీకి గంపగుత్తగా మద్దతు ఇవ్వకపోవచ్చని అంచనా. అధ్యక్షుడిని నిర్ణయించడంలో ఏడు రాష్ట్రాలు కీలకంగా మారనున్నాయని అంటున్నారు. ‘స్వింగ్ స్టేట్స్’గా పిలవబడే అరిజోనా, జార్జియా, మిచిగాన్, నెవాడా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లోని తటస్థ ఓటర్లను  ఎవరు ప్రసన్నం చేసుకోగలుగుతారో వారిదే విజయమని విశ్లేషకుల అంచనా. వచ్చే నెల 10న కమలా హారిస్‌తో తొలిసారి ప్రత్యక్ష చర్చకు ట్రంప్ సిద్ధమవుతున్నారు. గతంలో బైడెన్‌తో జరిగిన చర్చ సందర్భంగా ట్రంప్ పైచేయి సాధించిన నేపథ్యంలోఈ డిబేట్‌కు ప్రాధాన్యత లభించింది. మొత్తంమీద ఒకప్పుడు ఏకపక్షంగా కనిపించిన అమెరికా ఎన్నికలు ఇప్పుడు నువ్వా, నేనా అన్న స్థాయికి చేరుకున్నాయి.