ఆమ్రపాలికి ఐదు కీలక పోస్టులు
- జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా నియామకం
ఇప్పటికే హెచ్‌ఎండీఏ, మూసీ రివర్ ఫ్రంట్ ఎండీతో పాటు పలు ముఖ్యమైన పదవులు
స్వాగతం పలుకుతున్న సమస్యలు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 24 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఐఏఎస్‌ల బదిలీలు చేపట్టింది. ఇటీవలనే 20 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసిన ప్రభు త్వం తాజాగా 44 మందిని బదిలీ చేసింది. ఈ బదిలీలలో 2010 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి కాటకు అతి కీలకమైన పోస్టులు కేటాయించారు. ఇప్పటికే పలు ముఖ్యమైన పోస్టులలో ఉన్న ఆమె కు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా పోస్ట్ కేటాయించడం చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) జా యింట్ కమిషనర్‌గా, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా, హైదరాబాద్ గ్రోత్ కారి డార్ లిమిటెడ్ డైరెక్టర్‌గా, ఔటర్ రింగ్ రోడ్డు డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఇది కాకుండా సోమవారం జరిగిన ఐఏఎస్‌ల బదిలీలలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా రోనాల్డ్ రాస్ స్థానంలో ఆమ్రపాలిని ప్రభుత్వం నియమించింది. దీంతో ఆమ్రపాలి 5 బాధ్యతలను నిర్వహించనున్నారు.
పోస్టులన్నీ హైదరాబాద్ చుట్టూనే...
ఆమ్రపాలి కాట 2010 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి. జీహెచ్‌ఎంపీ నుంచి ట్రాన్స్‌కో, జెన్‌కోకు బదిలీపై వెళ్లిన రోనాల్డ్ రాస్ 2006 బ్యాచ్‌కు చెందిన అధికారి. అయితే, ఐఏఎస్‌లలో చాలా మంది అధికారులు సీనియర్లు ఉన్నప్పటికీ, 2010 బ్యాచ్‌కు చెందిన ఆమ్రపాలికి రాజధాని నగరంలో కీలకమైన పోస్టులను ప్రభుత్వం కేటా యించడంపై పలువురు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ వ్యక్తిగత పనుల నిమిత్తం 15 రోజులు సెలవులో ఉన్నారు. ఈ 15 రోజుల పాటు జీహెచ్‌ఎంసీ ఇన్‌చార్జ్ కమిషనర్‌గా ఆమ్రపాలికే ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.
వాస్తవానికి సోమవారం నుంచే విధుల్లోకి రావాల్సిన రోనాల్డ్ రాస్ అసలు కార్యాలయానికి రాకుండానే బదిలీ కావాల్సి వచ్చింది. ఇన్‌చార్జ్ కమిషనర్‌గా ఉన్న ఆమ్రపాలికి పూర్తి బాధ్యతలను అప్పగించడం విశేషం. రాజధాని నగరం హైదరాబాద్‌లో అత్యంత కీలకమైన పోస్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో పాటు హైదరాబాద్ మహానగర అభివృద్ధికి సంబంధించిన పలు ప్రాజెక్టులను నిర్వహించే హెచ్‌ఎండీఏలోనూ, మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధి కోసం చేపడుతున్న ఎంఆర్‌డీసీఎల్, ఓఆర్‌ఆర్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ డైరెక్టర్‌గా ఇవన్నీ హైదరా బాద్ చుట్టూ, మరీ ముఖ్యంగా భూ సేకరణ, అభివృద్ధి సంబంధిత ప్రాజెక్టులే కావ డం విశేషం.
సమస్యల స్వాగతం..
జీహెచ్‌ఎంసీ కొత్త కమిషనర్ ఆమ్రపాలికి చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ వ్యాప్తంగా శానిటేషన్ (చెత్త) నిల్వలు తీవ్రమైన సమస్యగా ఉంటూ బల్దియా అధికారులకు సవాల్‌గా నిలుస్తోంది. ఇదే శానిటేషన్ విభాగంలో బోగస్ అటెండెన్స్ వ్యవహారం అనేక ఏళ్లుగా హాట్ టాపిక్‌గా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం వర్షాకాలం కావ డంతో గ్రేటర్‌లో చినుకు పడితే నాలాలు ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయి.
దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నగరంలో కొనసాగుతున్న పెండింగ్ ప్రాజెక్టులు, రహదారుల సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఒకప్పుడు కలిసి ఉన్న శానిటేషన్, హెల్త్ విభా గాలు ప్రస్తుతం వేర్వేరు కావడంతో వీటి మధ్య సమన్వయం కొరవడుతున్నట్టుగా తెలుస్తోంది. టౌన్ ప్లానింగ్ విభాగంలో అత్యధిక ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ సమస్యలన్నీ కొత్త బాస్‌కు సవాల్‌గా ఉండనున్నాయి.






