ప్రజల బాధలు పట్టని ఎమ్మెల్యే ఎందుకు..?
- కళ్ళకు గంతలతో బీఆర్ఎస్ వినూత్న ఆందోళన
- పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై గులాబీ దళం గళమెత్తిందీ. పట్టణంలో చేపట్టిన రోడ్డు పనులు అర్ధంతరంగా ఆగిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, 100పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీచేయాలని, జర్నలిస్ట్ ల స్థలం ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్యర్యంలో బజార్ ఏరియా ప్రధాన రహదారిపై వినూత్న నిరసన చేశారు. కళ్ళకు గంతలు కట్టుకొని గులాబీ శ్రేణులు రాస్తారోకో చేశారు.
పట్టణంలో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనుల అసంపూర్తి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మండిపడ్డారు. వెంటనే రోడ్డు పనులుచే పట్టాలని డిమాండ్ చేశారు. రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయలేని అసమర్ధుడు ఎమ్మెల్యే గడ్డం వినోద్ అని పేర్కొన్నారు. గతంలో తాను బెల్లంపల్లి జర్నలిస్టులకు ఇచ్చిన స్థలాన్నీ ఎమ్మెల్యే తన అనుచరులతో ఆక్రమించి నీచమైన పనులకు దిగజారిపోయాడని మండిపడ్డారు. వెంటనే భూకబ్జాకార్ల పై చర్యలు తీసుకోవాలనన్నారు.
జర్నలిస్టుల కు స్థలం తిరిగి అప్పగించాలన్నారు. బెల్లంపల్లి ప్రజలు నాణ్యమైన వైద్య సేవలు లేక ఇబ్బంది పడుతున్నారని వాపోయారు. తమ ప్రభుత్వ హయాంలో 100 పడుకల ఆస్పత్రిని నిర్మించామన్నారు. ఇందులో అవసరమైన వైద్యులు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని వాపోయారు. ఎమ్మెల్యే ఏమిచేస్తున్నారని ప్రశ్నించారు. ప్రజలు ఎదురుకొంటున్న ప్రధాన సమస్యలు పరిష్కరించనీ ఎమ్మెల్యే తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.






