భూ వివాదాల నేపథ్యంలో.. మాజీ ఎంపీటీసీ దారుణహత్య
- కళ్లలో కారం చల్లి, కర్రలతో కొట్టి చంపిన వైనం
గుంత తీసి డంపింగ్ యార్డులో పూడ్చివేత
అదుపులో ఇద్దరు నిందితులు.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 24 (విజయక్రాంతి): ఘట్‌కేసర్‌లో ఈ నెల 15న అదృశ్యమైన ఘట్‌కేసర్ మాజీ ఎంపీటీసీ, మేడ్చల్ జిల్లా మాల మహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం మహేష్ మిస్టరీ వీడింది. భూ వివాదంలో జోక్యం చేసుకొని తమ ఆస్తిని కాజేసేందుకు యత్నిస్తున్నాడని కక్ష పెంచుకున్న ప్రత్యర్థులు మహేష్‌ను దారుణంగా హత్య చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఘట్‌కేసర్ పట్టణంలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన గడ్డం మహేష్ రియల్ వ్యాపారి. అదే కాలనీకి చెందిన శ్రీనివాస్ అలియాస్ చిన్న(36), కడపొల్ల ప్రవీణ్ (24)తో మహేష్‌కు ఇటీవల భూ వివాదం నెలకొంది. తాము కబ్జాలో ఉన్న ప్లాట్లను రిజిస్టర్ చేయించుకొని కోర్టు ద్వారా స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తున్నాడని మహేష్‌పై వారు కక్ష పెంచుకున్నారు. ఎలాగైనా అతన్ని అంతమొందించి ఆస్తిని కాపాడుకోవాలని స్కెచ్ వేశారు.
పక్కా ప్లాన్ ప్రకారం..
ఘట్‌కేసర్‌లోని బైపాస్ రోడ్డులో ఉన్న మహేష్‌కు సంబంధించిన రియల్ ఎస్టేట్ కార్యాలయంలోనే ఈ నెల 14న రాత్రి అతడిని అంతమొందించాలని ప్లాన్ వేశా రు. పథకం ప్రకారం రాజీ చేసుకుందామని చెప్పి మహేష్‌ను ఆఫీస్‌కు రావా లని పిలిచారు. తాను సిటీలో ఉన్నందున రాలేకపోతున్నట్లు అతను చెప్పడంతో, 15న ఉదయం ఆఫీస్‌కు రావాలని కోరారు. ఈ క్రమంలో ఉదయం ఆఫీస్‌కు చేరుకున్న మహేష్ లోపలికి రాగానే, ప్లాన్ ప్రకారం వెంట తెచ్చుకున్న కారం పొడిని కళ్లలో కొట్టారు. విషయం గ్రహించి తప్పించుకునేందుకు యత్నించే లోపే కర్రలతో తలపై కొట్టడంతో మహే ష్ అక్కడికక్కడే మృతిచెందాడు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ఆఫీస్ షట్టర్ వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాత్రికి మళ్లీ వచ్చి అతని కారులోనే కొండాపూర్ శివారులో ఉన్న డంపింగ్ యార్డులోకి తీసుకెళ్లి జేసీబీతో గుంత తీసి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు.
పోలీసులను ఆశ్రయించిన మహేష్ తమ్ముడు..
ఇంటి నుంచి వెళ్లిన తన అన్న నాలు గు రోజులైనా తిరిగి రాకపోవడంతో మహేష్ తమ్ముడు విఠల్ ఈ నెల 20న ఘట్‌కేసర్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసు లు గాలింపు చర్యలు చేపట్టడంతో పాటు సీసీ ఫుటేజీలు, అతనికి వచ్చిన ఫోన్ కాల్స్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్న ట్లు సమాచారం తెలుసుకున్న నిందితులు మల్కాజిగిరి డీసీపీ పద్మజా రెడ్డి వద్ద ఆదివారం రాత్రి లొంగిపోయారు. ఘట్‌కేసర్ ఇన్‌స్పెక్టర్ సైదులు దర్యాప్తు ముమ్మరం చేసి మర్డర్ చేసిన ఇద్దరు నిందితులతో పాటు పూడ్చివేతలో పాల్గొన్న మరో నలుగురు నిందితుల వివరాలను సేకరించారు.
హత్య చేసిన నిందితులను అదుపులోకి తీసుకొని, వారికి సహకరించిన మరో నలుగురిని అరెస్టు చేసేందుకు బృందాలను ఏర్పాటు చేశారు. నిందితులను డంపింగ్ యార్డు వద్దకు తీసుకెళ్లి స్థలాన్ని గుర్తించి, సోమవారం ఉదయం స్థానిక డిప్యూటీ తహసీ ల్దార్ సందీప్‌రెడ్డి సమక్షంలో పంచనామ జరిపి, గాంధీలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని కుటుం బ సభ్యులకు అప్పగించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
కాగా, హత్యకు గురైన మహేష్ బంధువులు ఎదులాబాద్ రోడ్డులోని నిందితుల ఇంటి ఎదుట ధర్నాకు దిగారు. నిందితులను తమకు అప్పగించాలని పట్టుబట్టారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే హత్యకు పాల్పడ్డారని, హత్య వెనుక స్థానిక నాయకుల హస్తం ఉందని, లోతుగా దర్యాప్తు చేసి దోషులను శిక్షించాలన్నారు. పోలీసులు జోక్యం చేసుకొని చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.






