30 June, 2026 | 12:42 PM

సబర్బన్ రైల్వేలో వెనకబడిన హైదరాబాద్

27-05-2024 12:05 AM

హైదరాబాద్, మే 26 (విజయక్రాంతి): హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టం (ఎంఎంటీఎస్) రైళ్లు ఎంతో ఆదరణ పొందాయి. 2003లో వాటిని ప్రారంభించిన కొత్తలో ఎప్పుడు ఆ రైళ్లన్నీ జనంతో కిటకిటలాడేవి. నగరంలోని లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా, హైదరాబాద్ (నాంపల్లి) నుంచి ఫలక్‌నుమా వరకు ఈ రైళ్లు తిరిగేవి. రూ.5 కనీస ఛార్జితో ప్రయాణీకులను తక్కువ ఖర్చుతో గమ్యస్థానాలకు చేర్చేవి. అయితే ఇంత ఆదరణ ఉన్నా ఎంఎంటీఎస్ విస్తరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన దృష్టి సారించలేదు. ఒకరిపై మరొకరు నెపాన్ని వేసుకుంటూ వచ్చి ఎట్టకేలకు రెండో దశ లైన్ పూర్తిచేసినా రైళ్ల కేటాయింపులో మాత్రం ముందుకెళ్లలేకపోయాయి. ఎంఎంటీఎస్ రైళ్ల ద్వారా నిత్యం 50 వేల కంటే తక్కువ మందే ప్రయాణాలు చేసే స్థాయికి ఈ రవాణా వ్యవస్థ దిగజారిపోయింది. దేశంలోని మిగతా మెట్రో నగరాలైన ముంబయి, కోల్‌కతా, చెన్నైలో మాత్రం ఈ తరహా వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందింది. లక్షల మంది ప్రయాణాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ పరిస్థితి భిన్నంగా ఉంది. నగరంలో రోజురోజుకూ పెరిగిపోతున్న ట్రాఫిక్‌కు చెక్ పెట్టేందుకు అద్భుతమైన అవకాశంగా ఉన్నప్పటికీ అటు కేంద్రం, ఇటు రాష్ట్రం పట్టించుకోకపోవడంతో ఈ సేవలు ప్రయాణీకులకు అరకొరగా అందుతున్నాయి.

ఎంఎంటీఎస్ రైళ్లకు ఏమైంది...?

కరోనా కంటే ముందు నిత్యం సుమారు 1.50 లక్షల మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేరవేసిన ఎంఎంటీఎస్ రైళ్లకు ఏమైంది. 121 రైలు సర్వీసులు నిత్యం ప్రయాణీకులకు సేవలు అందించేవి. ఇప్పుడు నిత్యం 50 వేలలోపే ప్రయాణీకులు ఈ రైళ్లలో ప్రయాణాలు చేస్తున్నారు. 90లోపే ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తున్నాయి. క్రమంగా ఈ సేవలపై రైల్వే శాఖ శీతకన్ను వేసింది. ఆలస్యంతో పాటు ఏ రైలును ఎప్పుడు రద్దు చేస్తారో తెలియని విధంగా పరిస్థితిని మారింది. దీంతో ప్రజలు తమ రవాణా వ్యవస్థను మార్చుకున్నారు. హైదరాబాద్ మెట్రో ప్రారంభం తర్వాత ఎంఎంటీఎస్ రైళ్లు ఎక్కడం చాలావరకు మానేశారు. విద్యార్థులు, చిరుద్యోగులు, కార్మికులు, ఉద్యోగాలు, రోజువారీ పనులకు వెళ్లేవారు ఈ లోకల్ రైళ్లపై ఎంతో భరోసాగా ఉండేవారు. కానీ వేళాపాలలేని ఈ రైళ్లపై ఇప్పుడు ప్రయాణీకులు నమ్మకం కోల్పోతున్నారు. ఎంఎంటీఎస్ రైళ్లలో కనీస ఛార్జి రూ.5 మాత్రమే. ఆర్టీసీలో రూ.10 కాగా, మెట్రోలో రూ.15. ఓ 20 కి.మీ. దూరం ప్రయాణిస్తే మెట్రోలో కనీసం రూ.50కి పైగా చెల్లించాల్సి వస్తుంది. ఆర్టీసీలోనూ దాదాపుగా రూ.30 అవుతుంది. అదే ఎంఎంటీఎస్‌లో అయితే రూ.10 లోపే. పేదవాడి రైలు బండిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా వేళకు రైళ్లు నడవని పరిస్థితి తలెత్తుతోంది. ఫలితంగా లోకల్ రైళ్లు లేక మెట్రో, సిటీ బస్సులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఫలితంగా పేదవాడి జేబుకు చిల్లు పడుతోంది. 

ట్రాక్ సిద్ధంగా ఉన్నా... 

మొదటి దశలో 45 కి.మీ. మేర ఎంఎంటీఎస్ సేవలు ప్రారంభం కాగా 2012లో రెండో దశకు శ్రీకారం చుట్టారు. సికింద్రాబాద్ భువనగిరి, సికింద్రాబాద్ మనోహరాబాద్, ఫలక్‌నుమా ఉందానగర్, మౌలాలీ సనత్‌నగర్, తెల్లాపూర్ రామచంద్రాపురం డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్ పనులు నత్తనకడకన సాగి ఈ ఏడాది ఏప్రిల్ 8న పూర్తయ్యాయి. ప్రధాని మోదీ రెండో దశ ఎంఎంటీఎస్‌ను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం లేకపోయినా కేంద్రం ఈ లైన్లను పూర్తి చేసింది. కానీ, రాష్ట్ర సర్కారుకు మెట్రోపై ఉన్న ధ్యాస ఎంఎంటీఎస్‌పై మాత్రం లేదనే చెప్పాలి. మెట్రో కోసం వేలాది కోట్లను విడుదల చేసిన గత బీఆర్‌ఎస్ సర్కారు.. ఎంఎంటీఎస్ విషయంలో మాత్రం సహకరించలేదు. తన వాటా రూ.600 కోట్లలో కేవలం రూ.229 కోట్లను మాత్రమే విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వమే తన సొంత నిధులతో రెండో దశ ఎంఎంటీఎస్ రైల్వే లైన్లను పూర్తి చేసినా ఆ లైన్లకు సరిపడా రైళ్లను మాత్రం తిప్పడం లేదు. లింగంపల్లి నుంచి మేడ్చల్‌కు కేవలం ఒక్క ఎంఎంటీఎస్ రైలును ఉదయం 10.20 గంటలకు వెళ్తుంది.

ఇక మేడ్చల్ నుంచి లింగంపల్లికి ఉదయం, సాయంత్రం రెండు రైళ్లు నడుస్తున్నాయి. ఇక ఫలక్‌నుమా రామచంద్రా పూర్ మధ్య 45 కి.మీ. ట్రాక్ సిద్ధంగా ఉంటే రైల్వే శాఖ నడుపుతున్నది కేవలం ఒకే ఒక్క రైలు. ఇక ఫలక్‌నుమా నుంచి ఉందానగర్ (శంషాబాద్) వరకు కూడా రెండో లైన్ ఎప్పుడో అందుబాటులోకి వచ్చినా కనీసం ఫలక్‌నుమా వరకు నడిచే ఎంఎంటీఎస్ రైళ్లను పొడిగించాలనే ఆలోచన కూడా రైల్వే శాఖకు లేదనే చెప్పాలి. కేవలం 9 రైళ్లను మాత్రమే ఉందానగర్ వరకు నడుపుతున్నారు. ఉందానగర్‌కు రైళ్ల సంఖ్యను పెంచితే నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్టుకు చేరుకునే వారికి సౌలభ్యంగా ఉంటుంది. అలాగే రాయలసీమ, ఉమ్మడి మహబూబ్‌నగర్ నుంచి హైదరాబాద్ వచ్చే ప్రయాణీకులు శంషాబాద్ నుంచి ఎంఎంటీఎస్ ద్వారా నగరంలోని వివిధ ప్రాంతాలకు త్వరగా చేరుకునే వీలుంటుంది. అలాగే ఉందానగర్ నుంచి సమీపంలోనే ఉన్న ఎయిర్‌పోర్టుకు కొత్తగా రైల్వే లైన్ వేస్తే కేవలం రూ.20 చెల్లించి నగరంలోని ఎక్కడి నుంచైనా విమానాశ్రయం చేరుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది.  

పేదవాడి ప్రయాణంపై చిన్నచూపు

ఒకప్పుడు ఎంఎంటీఎస్ రైళ్లు అంటే కచ్చితత్వానికి గుర్తుగా ఉండేవి. క్రమంగా వీటిని ఎవరికీ అక్కరకు రాని రైళ్లుగా మార్చేశారు. రైలు ఎప్పుడు వస్తుందో? ఎప్పుడు రద్దు అవుతుందో? తెలియని పరిస్థితి. దేశంలోని మిగతా ప్రధాన నగరాల్లో లోకల్ రైల్వే వ్యవస్థను ఎంతో అభివృద్ధి చేస్తుంటే హైదరాబాద్‌లో మాత్రం పట్టించుకోవడంలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ తీసుకోకపోవడంతో కేంద్రం ఈ రైళ్లపై దృష్టే సారించడం లేదు. మీకే పట్టనప్పుడు మాకేం అన్నట్లుగా కేంద్రం వ్యవహరిస్తోంది. ఎంపీలుగా ఎన్నికైన వారు స్థానిక ప్రయాణీకుల అవసరాలు, కష్టాలను గుర్తించి కేంద్రం దృష్టికి తీసుకుపోయి లోకల్ రైల్వే వ్యవస్థను పటిష్ఠం చేయాలి. కానీ ఇప్పటి వరకు అలాంటి ప్రయత్నం ఏదీ చేసినట్లుగా కనిపించడంలేదు. ముంబై లాంటి మహానగరాల్లో సబర్బన్ రైళ్లపై ఆధారపడి నిత్యం లక్షలాది మంది ప్రయాణాలు చేస్తున్నారు. ఈ సమస్యను గుర్తించి అధికారులు, ప్రజాప్రతినిధులు పరిష్కరించాలి.

 -గోపాల్ నారాయణ్, 

రైల్వే ప్రయాణికుల కమిటీ సభ్యుడు


చర్లపల్లి నుంచి నగరంలోకి ఎలా రావాలి...

సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడపై ప్రస్తుతం భారీగా ఒత్తిడిని తగ్గించేందుకు కొత్తగా చర్లపల్లి టర్మినల్‌ను సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే ఈ అధునాతన రైల్వే టెర్మినల్ ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. చర్లపల్లి ప్రారంభమయ్యాక కనీసం 25 జతల రైళ్లను అక్కడి నుంచి నడిపించాలని రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. ఈ రైళ్లను సకాలంలో అందుకోవాలన్నా లేక చర్లపల్లిలో దూరప్రాంతాల నుంచి వచ్చే రైళ్లు దిగిన ప్రయాణికులు నగరంలోని వేరువేరు ప్రాంతాలకు వెళ్లాలన్నా ఎంఎంటీఎస్ రైళ్లు తప్పనసరి. కానీ రైల్వే శాఖ పనితీరు ఇలాగే  ఉంటే మాత్రం చర్లపల్లి టెర్మినల్‌కు వెళ్లాలంటే రాత్రిపూట కష్టాలు తప్పవని భావిస్తున్నారు. ప్రస్తుతం నూతనంగా నిర్మించిన మౌలాలీ రైల్వే లైన్ ద్వారా సికింద్రాబాద్ చేరుకోకుండానే సుచిత్ర మీదుగా హైటెక్ సిటీకి ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణించే అవకాశం ఏర్పడింది. ఫలితంగా ఘట్‌కేసర్, చర్లపల్లి, మౌలాలీ ప్రాంతం నుంచి నేరుగా హైటెక్ సిటీకి వెళ్లేందుకు వీలున్నా ఈ మార్గంలో ఒకే ఒక్క రైలు నడుపుతోంది. ఈ మార్గంలో కనీసం పది జతల రైళ్లను నడిపిస్తే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు ఎంతో ప్రయోజనంగా ఉండనుంది.

ఎంఎంటీఎస్ గురించి ఆలోచించడమే లేదు

ఒకప్పుడు ఫలక్‌నుమా నుంచి లింగంపల్లి వైపు వెళ్లాలన్నా, నాంపల్లి నుంచి సికింద్రాబాద్ రావాలన్నా ఎంఎంటీఎస్ రైలు ఉందిలే అనుకునేవాళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎంఎంటీఎస్ కోసం స్టేషన్‌కు వెళ్తే అసలు ఆ రైలు ఎప్పుడు వస్తుందో కూడా తెలియడం లేదు. రైల్వే రియల్ టైం, ఆన్‌లైన్ టైం టేబుల్, ఎన్‌టీఈఎస్ యాప్ లేదా వేర్ ఈజ్ మై ట్రైన్ లాంటి ప్రైవేట్ రైల్వే టైం టేబుల్ యాప్‌లలో ఎంఎంటీఎస్ రైలు ఎక్కడ ఉందో కూడా చూయించడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం మెట్రో సేవలపై ఉన్న ప్రేమను ఎంఎంటీఎస్‌పై చూపించడం లేదు. ఫలితంగా ఈ రైళ్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కొత్త లైన్లు వేసినా రైళ్లు కేటాయించడం లేదంటేనే ప్రభుత్వాలకు పేదవాడి రవాణా వ్యవస్థ మీద ఉన్న అభిప్రాయం అర్థం అవుతుంది. అడిగే వారు లేరనే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. హైదరాబాద్ ఐటీకి కేరాఫ్ అడ్రస్ అని చెప్తే మాత్రమే సరిపోదు. అందుకు తగ్గట్లుగా ప్రజా రవాణా వ్యవస్థను కూడా తీర్చిదిద్దాలి.

 -హరీశ్ కొంతం, 

అడ్వకేట్, నారాయణగూడ