అడోబ్ సీఈఓగా మరోసారి భారతీయుడు
అనిల్ చక్రవర్తికి పగ్గాలు
డిసెంబర్ 1న బాధ్యతల స్వీకరణ
వాషింగ్టన్, సెప్టెంబర్ 4: అమెరికాకు చెందిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ అడోబ్(Software company Adobe) నాయకత్వ పగ్గాలు మరోమారు భారతీయుడికే వరించాయి. ఇప్పటివరకు సీఈఓగా ఉన్న శంతను నారాయణ్ స్థానంలో అడోబ్ నూతన సీఈఓగా అనిల్ చక్రవర్తి(Anil Chakravarthy) నియమితులయ్యారు. డిసెంబర్ 1న అనిల్ నూతన బాధ్యతలు స్వీకరించనున్నట్లు సంస్థ వెల్లడించింది.
మార్కెట్‌లో ప్రస్తుతం ప్రవేశించిన ఏఐని మరింత క్రియేటివ్‌గా తీర్చిదిద్దేం దుకు సంస్థ ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగానే నాయకత్వ మార్పు చోటు చేసుకుంది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటనలో పేర్కొం ది. అనిల్ చక్రవర్తిని అడోబ్ తన కొత్త ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా ఉంటారని, ఆయన బాధ్యతలు చేపట్టాక, శాంతను నారాయణ్ ఎగ్జిక్యూటివ్ చైర్ పాత్రలోకి మారతారని తెలిపింది.
బనారస్ హిందూ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి అయిన అనిల్ చక్రవర్తి, అడోబ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఆర్కెస్ట్రేషన్ వ్యాపారం, ప్రపంచవ్యాప్త ఫీల్ ఆపరేషన్స్‌కు ప్రెసిడెంట్‌గా ఉన్నారు. శంతను రెండు దశాబ్దాలుగా అడోబ్‌లో సీఈవోగా కొనసాగుతున్నారు. అయితే ‘ఏఐ -ఆధారిత యుగంలో అడోబ్ వృద్ధికి నాయకత్వం వహించడానికి అనిల్ సరైన వ్యక్తి అని నేను పూర్తి విశ్వాసంతో ఉన్నాను. ఎగ్జిక్యూటివ్ చైర్‌గా నా కొత్త పాత్రలో ఆయనతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను’ అని నారాయణ్ ఒక ప్రకటనలో తెలిపారు.
భారత్‌కు చెందిన అనిల్ చక్రవర్తి ఐఐటీ వారణాసి నుంచి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ చదివారు. మసాచ్చుస్టేట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్ ఆఫ్ సైన్స్, పీహెచ్‌డీ పట్టా సాధించారు. 2020లో ఆయన అడోబ్‌లో చేరారు. డిజిటల్, కస్టమర్ సపోర్ట్, గ్లోబల్ సేల్స్ తదితర విభాగాల్లో పనిచేశారు. ఆయన నాయకత్వ పటిమతో ఏకంగా అడోబ్‌లో సీఈవో స్థాయికి ఎదిగారు. ముఖ్యంగా అమెరికా, ఐరోపా, ఆసియాల్లో సంస్థ సేవలను మరింత విస్తరించేందుకు అనిల్ చక్రవర్తి కృషి చేయనున్నారు.






