15 June, 2026 | 3:18 AM

బోయిన్‌పల్లి భూమిపై విచారణ జరపాలి

15-06-2026 02:02 AM
  1. సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్ లేఖ
  2. 800 కోట్ల ప్రభుత్వ భూమి ప్రైవేటు చేతుల్లోకి వెళ్లిందని ఆరోపణ

హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): సికింద్రాబాద్ కంటోన్‌మెంట్ పరిధిలోని బోయిన్‌పల్లి ప్రాంతంలో ఉన్న 8 ఎకరాల ప్రభుత్వ భూమి వ్యవహారంపై తక్షణ విచారణ జరపాలని బీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిషాంక్ సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. 

సర్వే నంబర్ 157/1లో ఉన్న ఈ భూమి విలువ సుమారు రూ.800 కోట్లు ఉంటుందన్నారు. గతంలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల కోసం గుర్తించిన ఈ భూమి ప్రస్తుతం ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలోకి వెళ్లిందనే ఆరోపణలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. 2025లో ఇదే భూమిపై 6 వేల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు వచ్చినట్లు, స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం కూడా చేసినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు ఆ భూమి చుట్టూ కంచె వేసి ప్రైవేటు నియంత్రణలోకి తీసుకెళ్లా రనే వార్తలు స్థానికుల్లో ఆందోళన కలిగిస్తున్నా యని పేర్కొన్నారు. 

ఈ వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే గణేష్ మౌనం అనుమానాలకు తావిస్తోందని, ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు. 8 ఎకరాల భూమి యాజమాన్యం, ప్రస్తుత స్థితిపై విచారణ జరపాలని కోరారు.