హామీలు అమలు చేయరా?
- మెట్రో రెండో దశకు కేంద్రం సిద్ధం
- రాజీనామాల డిమాండ్ అనవసరం
- తెలంగాణలో బీజేపీని మరింత బలోపేతం చేస్తాం
- అంబర్‌పేట్ అభివృద్ధిలో బీజేపీ పాత్ర కీలకం
- నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
- హాజరైన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
అంబర్‌పేట, జూన్ 14 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రె స్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమ లు చేయడంలో విఫలమైందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. 2004లో అంబర్‌పేట్ ప్రజల మద్దతుతో తెలంగాణలో బీజేపీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా నిలిచానని గుర్తు చేసుకున్నారు. ఆదివారం అంబర్‌పేట్‌లో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో అయన పాల్గొని ప్రసంగించారు.
అంబర్‌పేట్ నియోజకవర్గంలో 21 ప్రభుత్వ పాఠశాల భవనాలు, వందకు పైగా కమ్యూనిటీ హాల్స్, బీసీ హాస్టల్, దోబీ ఘాట్లు, ఐదు విద్యుత్ సబ్‌స్టేషన్లు, పార్కులు, లైబ్రరీలు, అంగన్వాడీ కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, గృహ నిర్మాణ పథకాలను అమలు చేశామని తెలిపారు. దాదాపు రూ.400 కోట్ల వ్యయంతో అంబర్‌పేట్ ఫ్లైఓవర్‌ను కేంద్ర ప్రభుత్వం నిర్మించిందన్నారు. మహంకాళి ఆలయం సమీపంలో ఫ్లైఓవర్ కింద రోడ్డు నిర్మాణానికి కొందరు మజ్లిస్ నాయకులు, అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించాయని ఆరోపించారు. ఈ అంశంపై మాజీ సీఎం కేసీఆర్, నేటి సీఎం రేవంత్‌రెడ్డిలకు లేఖలు రాసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదన్నారు.
మెట్రో రెండో దశకు కేంద్రం ఆమోదం
మెట్రో రెండో దశ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, 50 శాతం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలన్న కాంగ్రెస్ డిమాండ్‌కు అర్థం లేదని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌తో పాటు తెలంగాణ అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు అందిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.
కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ప్రకటించిన బీసీలకు నిధులు, దళిత కుటుంబాలకు ఆర్థిక సాయం, నిరుద్యోగ భృతి, మహిళలకు నెలసరి సహాయం, విద్యార్థులకు విద్యా భరోసా, రైతులకు బోనస్, కౌలు రైతులకు సాయం వంటి హామీలు అమలు కాలేదని ఆరోపించారు. తెలంగాణ, హైదరాబాద్ ప్రజలు ప్రభుత్వ పనితీరును సమీక్షించి బీజేపీని మరింత బలోపేతం చేయాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్, మాజీ మంత్రి కృష్ణయాదవ్ ప్రసంగించారు. బీజేపీ నాయకులు కన్నె రమేష్ యాదవ్ పాల్గొన్నారు.






