పనిఒత్తిడి.. అంగన్వాడీ టీచర్ మృతి
గద్వాల సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): జోగులాంబ గద్వాల(Jogulamba Gadwal) జిల్లా కేంద్రంలోని 11వ వార్డు అంగన్వాడీ 2వ సెంటర్లో టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న డి.విజయ శనివారం ఉదయం అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు.ఆమె స్థానిక అంబేద్కర్‌నగర్‌లోని పోలింగ్ స్టేషన్ నంబర్ 237కు బూత్ స్థాయి అధికారిగా కూడా విధులు నిర్వహిస్తున్నారు.ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా అదనపు పనిభారం పెరగడంతో అంగన్వాడీ సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి నెలకొంటోందని తోటి అంగన్వాడీ టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
బిఎల్ఓల పరిధిలో ఉండాల్సిన పలు పనులను అంగన్వాడీ టీచర్లతో చేయిస్తున్నారని నిరంతర పనిభారం కారణంగా సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు పేర్కొన్నారు.విజయ అకస్మాత్తుగా మృతి చెందడంతో అంగన్వాడీ టీచర్లు,ఆయాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.ఆమె మృతిచెందిన విషయం తెలుసుకున్న పలువురు సిబ్బంది పెద్ద సంఖ్యలో ఆమె నివాసానికి చేరుకుని భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.ఎస్ఐఆర్ విధుల్లో అంగన్వాడీ సిబ్బందిపై పనిభారం తగ్గించి వారి ఆరోగ్యం,భద్రతకు అధికారులు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని సిబ్బంది కోరుతున్నారు.