పంచభూతాలకు పద్యాభిషేకం
ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ (Acharya Appajosyula Satyanarayana )రచించిన ‘పంచవటి’ కావ్యం నిజంగా వేదం విజ్ఞానం కవిత్వ సమన్వయంతో కూడి న విశిష్ట గ్రంథం. ఈ నెల 20వ తేదీ మహాకవి దివంగత గడియారం వెంకట శేషశాస్త్రి పేరిట వారి కుటుంబం కడపకు చెందిన రచన సాహితీ వేదిక ద్వారా ప్రదానం చేయనున్న 45వ పురస్కారాన్ని పంచవటి కావ్యం అందుకోబోతుండటం ముదావహం.
ప్రాచీన ఛందస్సులో ఆధునిక విజ్ఞానాన్ని పలికించడం ఒక సాహసం. శాస్త్రసత్యం చెదరకుండా, పద్యం పాఠ్యపుస్తకంలా మారకుండా రసవంతంగా తీర్చిదిద్దడం మరింత కష్టం. ఆ రెండు లక్ష్యాలనూ సమర్థంగా సాధించిన రచన సాహితీ భాస్కర ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ రాసిన ‘పంచవటి పంచభూత తారావళులు’.
అగ్ని, జలం, భూమి, ఆకాశం, వాయువు అనే పంచభూతాలను పావక, సుజల, వసుంధర, అంతరిక్ష, సమీర వృత్త తారావళులుగా కవి దర్శించారు. ఇరవై ఏడు నక్షత్రాలకు ప్రతీకగా 27 పద్యాలతో సాగే ‘తారావళి’ అనే ప్రాచీన ప్రక్రియను ఇందుకు ఎంచుకోవడమే ఒక విశేషం. సంప్రదాయ సాహిత్యరూపంలో ఆధునిక శాస్త్రచింతనను ప్రవహింపజేయడం ఈ కావ్యానికి ప్రత్యేకత.
‘పావక వృత్త తారావళి’లో అగ్ని పొయ్యిలో మండే మంటకే పరిమితం కాదు. సూర్యుని తేజస్సు నుంచి జీవిలోని చైతన్యం వరకు వ్యాపించిన విశ్వశక్తి. కవి ఇలా దర్శిస్తారు
‘ఆకాశంబున సూర్యబింబమయి
మధ్యన్ వాయుసంచారణ
ప్రాకారంబయి భూతధాత్రి సకల
ప్రాణ స్థిరశ్వాసియై...’
ఇక్కడ వేదప్రతీక ఆధునిక శక్తివిజ్ఞానంతో మమేకమవుతుంది. సూర్యుడు, వాయువు, జీవచైతన్యం అన్నింటినీ ఒకే అగ్నితత్త్వపు విభిన్న వ్యక్తీకరణలుగా చూడటం కవి తాత్త్విక దృష్టికి నిదర్శనం.
రెండవదయిన ‘సుజల వృత్త తారావళి’లో సముద్రం నుంచి ఆవిరి, మేఘం, వర్షం, నది, పంట వరకు సాగే జీవచక్రానికి జలం మూలాధారం. అయితే కవి జలసౌందర్యాన్ని వర్ణించి ఆగిపోరు. పారిశ్రామిక కాలుష్యంపై గట్టి హెచ్చరిక చేస్తారు
‘పారిశ్రామికమైన వ్యర్థములతోన్ భస్మాసురప్రాయులై ధారాపాతముగా రసాయన పదార్థశ్రేణి...’
కాలుష్యకారులను ‘భస్మాసురప్రాయులు’ అనడం పదునైన కవిప్రయోగం. మానవుడు సాధించిన విజ్ఞానమే విచక్షణ కోల్పోతే అతని జీవనాధారాలను భస్మం చేయగలదన్న హెచ్చరిక ఇందులో ధ్వనిస్తుంది.
అదే కవి వర్షపు చినుకులను ‘దివ్యోదక తీర్థబిందువులు’గా అభివర్ణిస్తారు. శాస్త్రపరంగా జీవసృష్టికి ఆధారమైన వర్షం, కవి చేతిలో భూమాతకు జరిగే పవిత్ర సంప్రోక్షణగా మారుతుంది.
‘వసుంధర వృత్త తారావళి’లో భూమి ఒక గ్రహం కాదు; కేవలం మనిషి సొత్తు కాదు. సకల జీవరాశినీ మోసే మహామాత. పర్వతాలు, నదులు, అడవులు, వృక్షాలు, జీవవైవిధ్యం అన్నీ ఆమె వైభవమే అంటారు.
ప్రకృతి వనరులను తన సొత్తుగా భావించి విధ్వంసం చేస్తున్న మానవుణ్ణి కవి నిలదీస్తారు. ‘సర్వప్రాణి సంరక్షణ’ను ప్రతిపాదిస్తూ భూమిపై మనిషికే కాదు, ప్రతి జీవికీ హక్కుందని గుర్తుచేస్తారు. సృష్టి, స్థితి, పరిణామం, లయం అన్నింటికీ రంగస్థలమైన భూమిని మించిన దేవత మరొకటి ఉందా? అన్న ప్రశ్నలో పర్యావరణ స్పృహ తాత్త్విక స్థాయికి చేరుతుంది.
‘అంతరిక్ష వృత్త తారావళి’లో కవి కల్పనాశక్తి, ఖగోళ జిజ్ఞాస ఒకదానికొకటి రెక్కలవుతాయి. అనంత అంతరిక్షాన్ని ‘తారకల ఉద్యానవనం’గా ఊహించడం కవిత్వమైతే, ధ్రువతారను ప్రాచీన నావికుల దిక్సూచిగా గుర్తించడం విజ్ఞానం.
విశ్వరహస్యాల ముందు శాస్త్రానికున్న
పరిమితినీ కవి గుర్తిస్తారు
‘ఆద్యంతంబులు కానరానిది
తదీయారంభమేరీతిదో!
ఖద్యోతంబులు కోటికోట్లుగను
నక్షత్రంబులెట్లయ్యెనో!’
విశ్వం ఎక్కడ మొదలైంది? కోట్ల నక్షత్రాలు ఎలా ఆవిర్భవించాయి? అనే ప్రశ్నలకు విజ్ఞానం నిరంతరం సమాధానాలు వెదుకుతూనే ఉంది. ఆ జిజ్ఞాసనే పద్యంగా మార్చడం ఈ తారావళి సౌందర్యం.
ఇక సమీరం కనిపించని జీవశక్తి అని వేరే చెప్పాలా! వాయువు కనిపించదు; కానీ జీవితం ప్రతి క్షణం దాని ఉనికిని ప్రకటిస్తుంది. ‘సమీర వృత్త తారావళి’లో శ్వాస నుంచి మేఘసంచారం, వర్షచక్రం వరకు వాయువు పాత్రను అప్పాజోస్యుల వారు పద్యబద్ధం చేశారు
‘ద్యుమణిద్యుత్తులు నీటి యావిరుల
నుత్పత్తించి మేఘావళుల్...
... సుజలచక్రంబిట్లు సాగించెడున్.’
సూర్యతాపం, నీటి ఆవిరి, మేఘాలు, వాయుసంచారం, వర్షం మొత్తం జలచక్రం ఒక వృత్తపద్యంలో ఒదిగిపోవడం విశేషం. అదే సమీరం యోగసాధనలో ప్రాణాయామంగా మారి మనోజయానికి మార్గం చూపుతుంది. శాస్త్రం నుంచి యోగతత్త్వం వరకు సాగిన ఈ అనుసంధానం కవి దృష్టివైశాల్యాన్ని తెలియజేస్తుంది.
అప్పాజోస్యుల వారి ప్రత్యేకత శాస్త్రీయ విషయాలను పద్యంలో చెప్పడంలో మాత్రమే లే దు. శాస్త్రాన్ని రసంగా, ప్రకృతిని తత్త్వంగా, ఛందస్సును నాదంగా మార్చడంలో ఉంది. సంస్కృత సమాసభూయిష్ఠమైన ప్రౌఢభాష, రూపకాలు, వ్యక్తీకరణలు, నాదసౌందర్యం ఆయన పద్యాలకు ప్రత్యేక గాంభీర్యాన్ని కలిగిస్తాయి.
‘పంచవటి’లో పావకం శక్తికి ప్రతీక; సుజలం జీవానికి ప్రతీక; వసుంధర పర్యావరణ ధర్మానికి ప్రతీక; అంతరిక్షం అనంత విజ్ఞానజిజ్ఞాసకు ప్రతీక; సమీరం జీవచలనానికి ప్రతీక. అందుకే ఈ కావ్యంలో వేదం గతానికి చెందిన జ్ఞాపకం కాదు; విజ్ఞానం వర్తమానానికి పరిమితమైన సమాచారం కాదు; ప్రకృతి కేవలం ఆస్వాదించాల్సిన దృశ్యమూ కాదు. ఈ మూడూ కలిసి మనిషి భవిష్యత్తుకు బాధ్యతను గుర్తుచేస్తాయి.
పంచభూతాలను తెలుసుకోవడం విజ్ఞానం; వాటిలోని విశ్వతత్త్వాన్ని దర్శించడం భారతీయ దృష్టి; వాటిని కాపాడుకోవడం మానవ ధర్మం ఈ మూడు భావాల సంగమమే ‘పంచవటి’.
ప్రాచీన ఛందస్సు అనే పాత్రలో ఆధునిక విజ్ఞానామృతాన్ని నింపి, దానికి భారతీయ తత్త్వసుగంధాన్ని జోడించిన ‘పంచవటి’ో నిజంగా పంచభూతాలకు చేసిన పద్యాభిషేకం. ఈ గ్రంథానికి మహాకవి గడియారం వెంకటశేషశాస్త్రి పేరిటి 45వ పురస్కారాన్ని అందుకుంటున్న సందర్భంగా సాహితీ భాస్కరే శ్రీ అప్పాజోస్యుల సత్యనారాయణకి హార్ధిక శుభాకాంక్షలు. రచన సాహితీ వేదిక సభ్యులకు ముఖ్యంగా అధ్యక్షులు విహారికి ఇటువంటి ఉత్తమ కావ్యాన్ని ఎంపికచేసినందుకు అభినందనలు.