7 May, 2026 | 2:23 AM

ధనుష్ కలం నుంచి మరో గీతం!

28-07-2025 12:58 AM

కోలీవుడ్ స్టార్ ధనుష్ రూపొందుతున్న తాజాచిత్రం ‘ఇడ్లీ కడై’ (ఇడ్లీ కొట్టు). నిత్యామీనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ధనుష్ స్వీయ దర్శక త్వంలో తెరకెక్కుతోంది. డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై ధనుష్, ఆకాశ్ భాస్కరన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న చిత్రబృందం తాజాగా మ్యూజికల్ ప్రమోషన్స్‌కూ తెర తీసింది.

ఆదివారం ఈ సినిమా నుంచి తొలిగీతం విడుదలైంది. ‘ఎన్న సుగం’ (ఎంత ఆనందం) పేరుతో తమిళ వెర్షన్‌లో రిలీజ్ చేశారు. ఈ పాటలో ధనుష్, నిత్యామీనన్ కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. జీవీ ప్రకాశ్ స్వరాలు సమకూర్చిన ఈ గీతానికి హీరో ధనుష్ సాహిత్యం అందిస్తూ, శ్వేత మోహన్‌తో కలిసి ఆలపించారు. ఈ చిత్రం 2025, అక్టోబర్ 1న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.  

సెట్‌లో అగ్ని ప్రమాదం 

‘ఇడ్లీ కడై’ సెట్‌లో శనివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తమిళనాడు తేని జిల్లా అనుప్పపట్టిలో నిర్మించిన సెట్‌లో రసాయనాలు, ఫ్లెక్సీలు, పెయింట్స్, చెక్క వంటివి ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. సెట్ దాదాపు పూర్తిగా దగ్ధం కాగా, ఎవరికీ గాయాలు కాలేదని, ప్రాణనష్టం జరగలేదని సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది. ఈ ప్రమాదం నేపథ్యంలో షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు.