భాష.. యాస.. అందర్నీ కలుపుకుపోవాలి
‘మై విలేజ్ షో’ ఫేమ్ అనిల్ గీలా, వర్షిణిరెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రల్లో కరీంనగర్ నేపథ్యంలో ఓ ప్రేమకథ రూపొందింది. శివకృష్ణ బుర్రా ఈ వెబ్‌సిరీస్‌ను ఏడు ఎపిసోడ్స్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సిరీస్ టైటిల్ కూడా ‘మోతెవరి లవ్‌స్టోరీ’ అంటూ పక్కా తెలంగాణ స్టుల్‌లోనే పెట్టడం విశేషం.
ఈ సిరీస్ ఆగస్టు 8 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఆదివారం ఈ సిరీస్‌కు సంబంధించి ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా హీరో, దర్శకుడు తరుణ్‌భాస్కర్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “భాష, యాస అంద రినీ కలుపుకుని పోయేలా ఉండాలి. సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు. ‘మై విలేజ్ షో’ టీమ్ అదే చేసింది. అంకితభావం వాళ్ల గురించి అమెరికాలో మాట్లాడుకునేలా చేసింది.
వాళ్ల సంకల్పం అన్నింటి కంటే గొప్పది. ఈ టీమ్ అందరికీ స్ఫూర్తి. అనిల్ ఇంకా ఎంతో ఎత్తుకు ఎదుగుతారని నమ్మకంగా చెబుతున్నా” అన్నారు. కథా నాయకుడు అనిల్ గీలా మాట్లాడుతూ.. “మై విలేజ్ షో’కు పనిచేసే వారంతా ఒక్కో పనిలో బిజీగా ఉండేవాళ్లం. అందరం కలిసి చేసిన ప్రయాణం ఇక్కడి వరకు వచ్చింది. ఇలాంటి ఓ స్థాయికి రావాలని చాలా ఏళ్లుగా కష్టపడుతున్నాం. ఇలా స్టేజ్ మీద ఉంటే మేం ఏదో సాధించామనే ఫీలింగ్ కలుగుతోంది” అని చెప్పారు.
‘మా సిరీస్ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంద’ని కథానాయకి వర్షిణి తెలిపారు. దర్శకుడు శివకృష్ణ మాట్లాడుతూ.. “మై విలేజ్ షో’ ద్వారా మాకు వచ్చిన ప్రేమను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటాం. ఈ క్రమంలోనే ‘మోతెవరి లవ్‌స్టోరీ’ రూపొందించాం. అందరినీ నవ్వించేలా, మెప్పించేలా ఉంటుంది” అన్నారు. నిర్మాత శ్రీరామ్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. “ఇది మాకు ఆరంభమే. మున్ముందు మరింత చేయబోతోన్నాం” అని తెలిపారు. మధుర శ్రీధర్, జీ5 సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జయంత్, కెమెరామెన్ శ్రీకాంత్ అరుపుల, చరణ్ అర్జున్‌తోపాటు సిరీస్ బృందం అంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.






