టెట్ నార్మలైజేషన్‌పై స్పష్టత ఏదీ?

05-05-2024 01:31:12 AM

టెట్‌లో నార్మలైజేషన్ ఉంటుందా? ఉండదా?

స్పష్టతనివ్వాలని అభ్యర్థుల డిమాండ్

హైదరాబాద్, మే 4 (విజయక్రాంతి): ఎట్టకేలకు టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష)కు సంబంధించిన పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, టెట్ పరీక్షలకు నార్మలైజేషన్ విధానం ఉంటుందా? ఉండదా? అనే దానిపై విద్యాశాఖ స్పష్టతనివ్వలేదు. దీనిపై త్వరగా స్పష్టతనివ్వాల్సిందిగా అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. టెట్ పరీక్షలు ఈనెల 20 నుంచి జూన్ 2 వరకు జరగనున్నాయి. ప్రతీ రోజు రెండు షిఫ్టుల్లో మొత్తం 20 విడతల్లో పరీక్షలను నిర్వహించనున్నారు. ఈసారి టెట్ పరీక్షను ఆన్‌లైన్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో నిర్వహిస్తున్నారు. అయితే ఒక్కో పేపర్ మూడు రోజుల చొప్పున 6 విడుతల్లో పరీక్ష జరగనుంది. విడుతల వారీగా ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తుండటంతో ఒక్కో షిఫ్ట్‌కు ఒక్కో ప్రశ్నపత్రం వస్తుంది. దీంతో అందరికీ ఒకే రకమైన ప్రశ్నపత్రం ఉండదు. డీఎస్సీలో టెట్‌కి 20 శాతం వెయిటేజీ ఉండడంతో ఒక షిఫ్ట్‌లో పేపర్ కఠినంగా, మరో షిఫ్ట్‌లో పేపర్ సులభంగా వస్తే ఎలా? అన్న సందేహాలను అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నారు. 

ఏపీలో అమలు, మరి మనదగ్గర?

వివిధ సెషన్లలో నిర్వహించే పరీక్షలకు నార్మలైజేషన్ ఉంటుంది. కానీ టెట్ నార్మలైజేషన్‌పై నోటిఫికేషన్‌లో అధికారులు స్పష్టత ఇవ్వలేదు. గతంలో టెట్‌ను ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించడంతో అభ్యర్థులందరికీ ఒకే పేపర్ ఇచ్చేవారు. దీంతో జవాబు పత్రాల మూల్యాంకనంలో సమస్యలు తలెత్తేవి కాదు. కానీ ఈసారి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తుండటంతో నార్మలైజేషన్ సమస్య తెలెత్తిందని అభ్యర్థులు చెప్తున్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించే ఆన్‌లైన్ పరీక్షలకు సాధారణంగా నార్మలైజేషన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్  నిర్వహించిన టెట్ (ఏపీ టెట్)లోనూ ఈ విధానాన్ని అమలు చేశారు. ఆన్‌లైన్ విధానం పేరుతో నార్మలైజేషన్ చేస్తే మార్కుల్లో భారీ వ్యత్యాసాలు వస్తాయని, దీని వల్ల చాలా రాష్ట్రాల్లో అభ్యర్థులు నష్టపోయారని అంటున్నారు. అదేవిధంగా జిల్లాల వారీగా అందరికీ ఒకేసారి పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు. నార్మలైజేషన్ విధానంలో సులువుగా వచ్చిన పేపర్లను, కఠినంగా వచ్చిన పేపర్లను అంచనా వేసి సరాసరిగా మార్కులు నిర్ణయిస్తారు. ఆ తర్వాత ఈ విధానంలో పేపర్ సులువుగా వచ్చిన వారికి కొన్ని మార్కులను కోత విధించి, పేపర్ కఠినంగా వచ్చిన వారికి కొన్ని మార్కులు అదనంగా కలుపుతారు. ఈ విధానాన్ని టెట్ పరీక్షల ఫలితాల్లో అమలు చేయడం ద్వారా అభ్యర్థులు నష్టపోతారని, అందుకే నార్మలైజేషన్ లేకుండా టెట్‌ను నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు.