అపోలో హాస్పిటల్స్ లాభం భారీ వృద్ధి
ముంబై, మే 30: ప్రధాన హాస్పిటల్ చైన్ అపోలో హాస్పిటల్స్ కన్సాలిడేటెడ్ నికరలాభం 2024 మార్చితో ముగిసిన క్యూ4లో భారీగా 77 శాతం వృద్ధిచెంది రూ. 258 కోట్లకు చేరింది. సంస్థ ఆదాయం 15 శాతం పెరిగి రూ. 4,944 కోట్లకు చేరింది. గురువారం సమావేశమైన కంపెనీ డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ. 10 చొప్పున డివిడెండు సిఫార్సుచేసింది. డివిడెండు చెల్లింపునకు ఆగస్టు 17 రికార్డుతేదీగా నిర్ణయించింది. డాక్టర్ ప్రతాప్ సి రెడ్డిని హోల్‌టైమ్ డైరెక్టర్‌గా రీఅపాయింట్ చేస్తూ, రెండేండ్ల కాలానికి ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బోర్డు నియమించింది. ముగిసిన మార్చి త్రైమాసికంలో అపోలో హాస్పిటల్స్ ఇబిటా రూ.488 కోట్ల నుంచి రూ. 640 కోట్లకు చేరింది. సంస్థ హెల్త్‌కేర్ వ్యాపార ఆదాయం రూ.2,195 కోట్ల నుంచి 17 శాతం వృద్ధిచెంది రూ. 2,563 కోట్లకు పెరిగింది. ఈ వ్యాపారం ఇబిటా రూ. 593 కోట్లకు పెరగ్గా, 23.1 శాతం ఇబిటా మార్జిన్ సాధించింది. అపోలో హెల్త్ అండ్ లైఫ్‌స్టయిల్ స్థూల ఆదాయం 15 శాతం వృద్ధితో రూ. 355 కోట్లకు పెరిగింది.






