తగ్గిన వెండి బంగారాలు
తులం పసిడి రూ.440 తగ్గుదల
హైదరాబాద్, మే 30: అంతర్జాతీయ మార్కెట్లో కమోడిటీల ధరలన్నీ తగ్గిన నేపథ్యంలో స్థానిక మార్కెట్లో వెండి, బంగారాలు రెండూ దిగివచ్చాయి. గురువారం హైదరాబాద్ స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.440 తగ్గి రూ.72, 760 వద్ద నిలిచింది. 22 క్యారట్ల పుత్తడి తులం ధర మరో రూ.400 క్షీణించి రూ.66,700 స్థాయికి దిగింది. 10 రోజుల క్రితం పసిడి రూ.75,160 స్థాయికి చేరి కొత్త రికార్డును నెలకొల్పిన సంగతి తెలిసిందే. కేజీ వెండి ధర రూ.1,200 తగ్గుదలతో రూ.1,01,000 వద్దకు చేరింది. యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ అధికారులు వడ్డీ రేట్లు ఇప్పట్లో తగ్గవన్న సంకేతాలివ్వడంతో ఈ లోహాల ధరలు క్షీణించాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధి చెప్పారు. ప్రపంచ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 13 డాలర్ల మేర తగ్గి 2,339 డాలర్ల వద్దకు చేరింది. ఔన్సు వెండి ధర 32 డాలర్ల దిగువకు క్షీణించింది. శుక్రవారం వెలువడే యూఎస్ ద్రవ్యోల్బణం గణాంకాల ఆధారంగా వెండి, బంగారాల ట్రెండ్ ఉంటుందని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ వైస్ ప్రెసిడెంట్ జతిన్ త్రివేది చెప్పారు.






