నంది కంది ఆలయ నిర్మాణ వైభవాన్ని ఆస్వాదించిన గీతం ఆర్కిటెక్చర్ విద్యార్థులు
నక్షత్ర ఆకారపు లేఅవుట్, నిష్పత్తులు, క్లిష్టమైన శిల్పాల అధ్యయనం..
పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ మొదటి సంవత్సరం విద్యార్థులు సంగారెడ్డి జిల్లాలోని చారిత్రాత్మక నంది కంది ఆలయానికి స్కెచింగ్ విహారయాత్ర చేసి, దాని నిర్మాణ వైభవాన్ని ఆస్వాదించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు శ్రుతి గవాలి, సందీప్ కాసిన మార్గ దర్శకత్వంలో, విద్యార్థులు ఆలయ నక్షత్ర ఆకారపు లేఅవుట్, దాని నిష్పత్తులు, క్లిష్టమైన శిల్పాలను అధ్యయనం చేశారు. ఆచరణాత్మక స్కెచింగ్ ద్వారా డిజైన్ అంశాలను నిశితంగా పరిశీలించడానికి, అర్థం చేసుకోవడానికి, డాక్యుమెంటు చేయడానికి వారిని ప్రోత్సహించారు. ఇది దృశ్య, జ్జాపకశక్తిని పదును పెట్టడంతో పాటు, డిజైన్ సున్నితత్వాన్ని బలోపేతం చేసేందుకు దోహదపడింది.
విలక్షణమైన రేఖాగణితం, అద్భుతమైన రాతి నైపుణ్యానికి ప్రసిద్ధి చెందిన నంది కంది ఆలయం, సాంప్రదాయ భారతీయ వాస్తుశిల్పంలో రూపం, నిర్మాణం, అలంకారాల సామరస్యాన్ని అర్థం చేసుకోవడానికి స్ఫూర్తిదాయకమైన అభ్యాస వాతావరణంగా తోడ్పడింది. ఈ సందర్శన యువ వాస్తుశిల్పులలో అనుభవపూర్వక అభ్యాసంతో పాటు, వారసత్వ కట్టడాల గొప్పతనాన్ని తెలుసుకోవడానికి ఉపకరించింది. ఇటువంటి క్షేత్ర సందర్శనలు సాంకేతిక సామర్థ్యాన్ని పెంపొందించడమే గాక, భారతదేశ సాంస్కృతిక వారసత్వం పట్ల లోతైన అవగాహన, అపేక్షలను పెంపొందిస్తాయని అధ్యాపక సమన్వయకర్తలు అభిప్రాయపడ్డారు. నిర్మాణ సారాన్ని సంగ్రహించగల సామర్థ్యానికి నిదర్శనంగా విద్యార్థుల స్కెచ్ లు నిలవడమే గాక, తరగతి గది భావనలను వాస్తవ ప్రపంచ అన్వేషణతో అనుసంధానించాయి.




