26 May, 2026 | 2:39 AM

హెల్త్ కార్డులు ప్లాస్టిక్ ముక్కలేనా?

26-05-2026 01:45 AM

ఆస్పత్రులు చికిత్సకు అంగీకారం తెలిపాయా?

  1. హెల్త్ స్కీంపై ఉద్యోగుల్లో అనుమానాలు! 
  2. ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులతో చర్చించకుండానే అమలుకు సన్నద్ధం!

హైదరాబాద్, మే 25 (విజయక్రాంతి): రాష్ర్ట ప్రభుత్వం ఎంప్లాయీస్ న్యూ హెల్త్ స్కీం (ఈహెచ్‌ఎస్) అమలుకు చర్యలు వేగవంతం చేసింది. కానీ ఇది అమలయ్యే తీరుపై ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం హడావుడిగా హెల్త్ కార్డులను జారీచేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈహెచ్‌ఎస్ హెల్త్ కార్డులు జారీచేసే ముందు పకడ్బందీగా విధివిధానాలు, మార్గదర్శకాలను రూపొందించకుండా, నామ్‌కేవాస్తేగా జారీ చేయకూడదనే డిమాండ్ ఉపాధ్యాయవర్గం నుంచి వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఎమ్‌ప్యానెల్‌మెంట్ ఆస్పత్రులతో చర్చించకుండా, వారు అంగీకరించకుండానే ఈహెచ్‌ఎస్ స్కీంను ఏ విధంగా అమలుచేస్తారు? అనే అనుమానాలను వ్యక్తంచేస్తున్నారు. 

కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం అందేనా?..

అసలు క్యాష్‌లెస్ వైద్య చికిత్సపై స్పష్టత లేకుండా జూన్ 2న హెల్త్ కార్డులు ఇస్తే, అవి కేవలం చేతిలో ఉండే ప్లాస్టిక్ ముక్కలుగానే మిగిలిపోతాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. కార్డుల దరఖాస్తు కంటే ముందు తేలాల్సిన అత్యంత కీలకమైన ప్రశ్నలను ఉద్యోగ, ఉపాధ్యాయవర్గం సంధిస్తుంది. ఈహెచ్‌ఎస్ చికిత్స కోసం అధికారికంగా ఏయే హాస్పిటల్స్ అంగీకరించాయో.. వాటి జాబితా విడుదల చేయాలని కోరుతున్నారు.

హాస్పిటల్ యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు జరిపితే వాటికనుగుణంగా కుదుర్చుకున్న ఒప్పందంపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. రాష్ట్రంలోనే అత్యంత ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రులైన యశోద, అపోలో, కేర్, కిమ్స్ మొదలైన ఆస్పత్రుల్లో ఈ స్కీం అమలవుతుందా? అందులో వైద్యంకోసం వచ్చే ఉద్యోగులకు క్యాష్‌లెస్ చికిత్స కింద అడ్మిట్ చేసుకోవాలని కోరుతున్నారు.

దీంతో పాటు ప్రస్తుత మార్కెట్ ధరలతో పోలిస్తే, ప్రభుత్వం నిర్ణయించే అతి తక్కువ ప్యాకేజీ ధరలకు చికిత్స చేయడానికి ఈ ప్రముఖ ఆసుపత్రులు అంగీకరించే అవకాశం ఉంటుందా? అని అనుమానాలను వ్యక్తంచేస్తున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం జారీచేసిన జీవో 317 అనుభవాన్ని చూసైనా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో ముందస్తు అధ్యయనం, పరిణామాలపై అంచనా లేకుండా, కేవలం రాజకీయ, అధికార యంత్రాంగాల హడావిడి నిర్ణయం వల్ల వచ్చిన జీవో 317 కొన్ని వేల మంది ఉద్యోగులను,  ఉపాధ్యాయులను సొంత జిల్లాల కు దూరం చేసి, పరాయి జిల్లాల్లో నానా అవస్థలు పడేలా చేసింది.

దాని తాలూకూ సమస్యలు ఇంతవరకు ఇంకా పరిష్కారం కా లేదు. ఇప్పుడు అదే తరహాలో ఎలాంటి స్పష్టమైన మార్గదర్శకాలు లేకుండా ప్రవేశపెడుతున్న ఎంప్లాయీస్ న్యూ హెల్త్ స్కీమ్ మరోసారి ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగుల్లో నెలకొన్న ఈ సందేహాలకు వివరణ, స్పష్టత ఇవ్వకుండా.. ప్రభుత్వం తన క్రెడిట్ కోసం అదీ ఉద్యోగుల సొమ్ముతో.. ఉద్యోగస్తులకు ఏదో చేసినట్టు ప్రచారం చేసుకుం టుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇవేవి తేల్చకుండా కార్డులిస్తే గతంలో జారీ చేసి హెల్త్ కార్డుల పరిస్థితిలాగే ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్య శ్రీ రోగులు ఎదుర్కొన్న సమస్యనే ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదుర్కోవలసి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు  తా ము చెల్లించే 1.5 శాతం మూలవేతనం కూ డా నష్టపోయే అవకాశం ఉందన్నారు.

ప్రభుత్వానికి ఉద్యోగ, ఉపాధ్యాయులు వేస్తున్న ప్రశ్నలు 

* గతంలో ఆసుపత్రులకు ప్రభుత్వం బకాయిపడిన పెండింగ్ బిల్లులు పూర్తిగా చెల్లించిందా?

* ఈహెచ్‌ఎస్ చికిత్స కోసం ఏయే హాస్పిటల్స్ అంగీకరించాయి?

* హాస్పిటల్ యాజమాన్యాలతో ప్రభుత్వం కొత్తగా సమావేశం నిర్వహించిందా?

* నిర్వహిస్తే ఏయే హాస్పిటల్స్ అంగీకరించాయి? అందులో ప్రముఖ హాస్పిటల్స్ ఉన్నాయా?

* ఈ ప్రముఖ హాస్పిటల్స్ ప్రభుత్వం ఇచ్చే ధరలకు చికిత్స చేయడానికి అంగీకరించాయా?

* ఈహెచ్‌ఎస్ అమలుకు ప్రభుత్వానికి, హాస్పిటల్స్ మధ్య కుదిరిన అంగీకారం ఏమిటి? అందులోని ప్రధాన అంశాలు ఏమిటి?

* ఏయే హాస్పిటల్స్ ఏయే చికిత్సలు చేయడానికి అంగీకరించాయి?

* ఉద్యోగుల  డీఏ, మెడికల్ రియింబర్సుమెంట్ లాంటి బిల్లులనే సంవత్సరాల చెల్లించలేని ప్రభుత్వం తన వాటా (1.5శాతం) జమచేస్తుందని ఎలా నమ్మడం?

* అటు ప్రభుత్వం తన వాటా జమ చేయకపోగా.. ఉద్యోగుల వేతనం నుంచి జమఅయిన మొత్తాన్ని సంక్షేమ కార్యక్రమాల అమలుకు వాడుకొని, ఆసుపత్రులకు బిల్లులు చెల్లింపులలో మళ్ళీ జాప్యం చేస్తే.. ఉద్యోగుల పరిస్థితి ఏంటి?

ఈహెచ్‌ఎస్ నిధుల నిర్వహణ ఎవరి పర్యవేక్షణలో ఉంటుంది.. వాటి పారదర్శక నిర్వహణకు తీసుకుంటున్న చర్యలు, చేస్తున్న ఏర్పాట్లు ఏంటి?

* రేపు ఈ కార్యక్రమం అమలులో జరిగే లోపాలకు, నిధుల దుర్వినియోగానికి బాధ్యత వహించేది ఎవరు.. ప్రశ్నించేది ఎవరు? ప్రశ్నించాల్సింది ఎవరిని?

* ఏ యూనియన్ నాయకులయినా తాము బాధ్యత వహిస్తామని ఉద్యోగులకు భరోసా ఇవ్వగలరా?