మహిళల సామాజిక ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
ఎమ్మెల్యే బీఎల్‌ఆర్
మిర్యాలగూడ, మే 25: సమాజంలో సగభాగమైన మహిళల సామాజిక ఆర్థిక అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి(బిఎల్ఆర్) అన్నారు. సోమవారం పట్టణంలోని పలు వార్డులలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, మున్సిపల్ చైర్ పర్సన్ చిలుకూరి సుధాబాలకృష్ణతో కలిసి మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనలో మహిళల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం వినూత్నంగా చేపట్టిన మహిళా వారోత్సవాల్లో భాగంగా చీరల పంపిణీ చేపట్టడం సంతోషాన్నిచ్చిందన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన కొరకు వారిని స్వయం ఉపాధి రంగాలలో ప్రోత్సహించేందుకు స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు 10 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాన్ని అందిస్తుందన్నారు.
అదే కాకుండా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పెట్రోల్ బంకుల కేటాయింపు తదితర వినూత్న కార్యక్రమాలు చేపట్టిందన్నారు. వారి సంక్షేమం కొరకు ప్రభుత్వం భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలు చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఆంగోతు చక్రి నాయక్, అవుట శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు మహిళా సంఘాల సభ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.






