7 June, 2026 | 1:38 AM

‘నీట్’ ఏర్పాట్లు పక్కాగా ఉండాలి

07-06-2026 12:17 AM
  1. ఏ చిన్న సమస్య తలెత్తవద్దు
  2. కమిటీలు సమన్వయంతో పనిచేయాలి
  3. కలెక్టర్లు,ఉన్నతాధికారులకు సీఎస్ ఆదేశం
  4. నీట్ ఏర్పాట్లు, ధాన్యం కొనుగోళ్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష

హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): నీట్- పరీక్ష ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశించారు. శనివారం సచివాలయం నుండి అదనపు డీజీపీ మహేష్ భగవత్, పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఇతర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, సీపీలు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

నీట్ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లు, ధాన్యం కొనుగోళ్లు, జూన్ 9న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న సీఎం సభ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడు తూ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 21వ తేదీన జరగనున్న నీట్ పరీక్షకు 24 పట్టణాల్లో 208 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 72 వేల 956 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, ఇందుకు తగిన ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని తెలిపారు.

పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయాలని, రాష్ట్ర, జిల్లా సమన్వయ కమిటీలు అందుకు అనుగుణంగా పనిచేయాలని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులపై తక్షణమే స్పందించాలన్నారు. ప్రభుత్వ సంస్థల్లో మాత్రమే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని, సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, అంతర్జాతీయ యోగా దినోత్సవం దృష్ట్యా పరీక్ష నిర్వ హణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు.

ప్రశ్న పత్రాల తరలింపు, అభ్యర్థుల రిజిస్ట్రేషన్, బయోమెట్రిక్ వెరిఫికేషన్, అభ్యర్థుల తనిఖీ, బందోబస్తు తదితర ఏర్పాట్లు పక్కాగా ఉండాలన్నారు. జాతీ య పరీక్ష సంస్థ (ఎన్‌టీఏ) డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ మాట్లాడుతూ  ఈ ఏడాది పరీక్షల నిర్వహణకు మరింత కట్టుదిట్టమైన భద్రత విధానాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రశ్నా పత్రాల రవాణా కోసం తొలిసారిగా భారత వైమానిక దళం సేవలను వినియోగిస్తున్నామని, పరీక్షల సమగ్రత, భద్రతకు ఇస్తున్న ప్రాధాన్యతకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. 

వర్షాలతో జాగ్రత్త..

రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని రక్షించేందుకు  ముందస్తు చర్యలు తీసుకోవాలని,  ధాన్యం నిల్వ ఉన్న ప్రాంతాల్లో కొనుగోళ్లు వేగవంతం చేయాలని ఆదేశించారు.

సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్ప టి వరకు 71 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, ఇప్పటి వరకు 10 లక్షల 58 వేల మంది రైతుల ఖాతాలలో 13,577 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు. మిగిలిన ధాన్యాన్ని కూడా త్వరితగతిన కొనుగోలు చేస్తామని తెలిపారు.