ప్రజల గుండె చప్పుడు కమ్యూనిజం
- సొంతంగా బలాన్ని పెంచుకుంటున్నాం
- మూడు నెలలు గ్రామాలు, బస్తీల్లో పర్యటనలు
- ఉచిత విద్య, వైద్యం కోసం పోరాటాలు
- కమ్యూనిజంపై అవగాహనలేని అజ్ఞాని పవన్ కళ్యాణ్
- ప్రెస్‌క్లబ్ ‘మీట్ ది ప్రెస్’లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): ప్రజల గుండె చప్పుడు కమ్యూనిజమని, సమాజంలో దోపిడీ ఉన్నంత కాలం అది ఉంటుంద ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ చెప్పారు. ప్రపంచంలో ఆర్థిక, సామాజిక అసమానతలు పెరిగే కొద్దీ కమ్యూనిజాన్ని, మార్క్స్ రాసిన దాస్ కాపిటల్ గ్రంథాన్ని అధ్యయనం చేసేవారి సంఖ్య పెరుగుతున్నదని తెలిపారు. సీపీఎం గ్రామ స్థాయి నుంచి బలాన్ని పెంచుకునే పనిలో ఉన్నదని, మూడు నెలల పాటు గ్రామాలు, బస్తీల్లో ప్రజలను కలిసే కార్యక్రమాన్ని రూపొందించామని తెలిపారు.
మత, ప్రాంత, కుల, డబ్బు, ప్రలోభాలతో చట్టసభ ల్లో తమకు సీట్లు తగ్గిన మాట వాస్తవమేనని, అయితే, వాటి పట్ల ప్రజల్లో ఉన్న భ్రమలు క్రమంగా తొలగిపోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయమని చెప్పారు. తాము పుంజుకుని ప్రజాశక్తిగా ఎదుగుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు ఉచిత విద్య, వైద్యం కోసం దీర్ఘకాలిక పోరాటాలు చేయబోతున్నట్టు ప్రకటించారు. శనివారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో జాన్‌వెస్లీ పాల్గొని మాట్లాడారు.
నీళ్లు, నిధులు, నియామకాల ఆధారితంగా ఏర్పడిన 12 ఏండ్ల తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. అట్టడుగు వర్గాల ప్రజల బతుకులు మారలేదని స్పష్టం చేశారు. ప్రాధాన్యతా క్రమంలో చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులను పూర్తి చేస్తూ వెళ్తే లక్షలాది ఎకరాలకు సాగునీళ్లు అందేవని అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టుల నిర్మాణాలు పాలక వర్గాలకు ఏటీఎంలుగా మారాయని విమర్శించారు.
రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చడంలో మోదీ సర్కారు వైఫల్యం చెందిందన్నారు. రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడంపై కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదని ప్రశ్నించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు లక్షలాది మంది ఉద్యోగాలు పోయే నిర్ణయాలు చేస్తున్నదన్నారు.
ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ హామీని కాంగ్రెస్ సర్కారు విస్మరించిందన్నారు. కౌలు రైతులకు, వ్యవసాయ కూలీల కు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మంది పేద లకు ఇండ్లు లేవని, వారికి స్థలాలిచ్చి ఇండ్లు కట్టించాలని ప్రభుత్వానికి సూచించారు.
కలిసికట్టుగా ముందుకు..
కేంద్ర ప్రభుత్వం విద్యకు 20 శాతం నిధులు కేటాయించాలని జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రయివేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం తేవాలని డిమాండ్ చేశారు. అందరికీ ఉచిత వైద్యం, విద్య అందేలా చర్యలు తీసుకోవాలని, వీటి కోసం ప్రజల్ని సమీకరించి బలమైన ఉద్యమాలను రూపొందిస్తామని తెలిపారు. తెల్ల రేషన్ కార్డుపై 14 రకాల సరుకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో మత విద్వేషాలను ప్రజల్లోకి జొప్పించి అధికారంలోకి రావాలని కొన్ని శక్తులు చూడటం తెలంగాణకే ప్రమాదకరమని హెచ్చరించారు. తెలంగాణలో తొమ్మిది కమ్యూనిస్టులు పార్టీలు ఉన్నాయని, ఐక్యకార్యాచరణతో ముందుకెళ్తున్నామని తెలిపారు.
పవన్ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం
కమ్యూనిస్టులపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలని జాన్‌వెస్లీ ఖండించారు. ప్రాంతీయ విద్వేష వైఖరితో మాట్లాడటాన్ని తప్పుబడుతున్నామని స్పష్టం చేశారు. కమ్యూనిజంపై అవగాహన లేని అజ్ఞాని పవన్ కళ్యాణ్ అని విమర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిజంపై అధ్యయనం పెరుగుతున్నదనీ, అమెరికాలోనూ కమ్యూనిస్టులు బలపడుతున్నారని తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయాలని చూస్తే ఉపేక్షించబోమని తెలిపారు.
ఏ రాష్ట్రంలోనైనా బీజేపీని నమ్మి ప్రాంతీయ పార్టీలు పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీలు ఖతమైపోతాయని పేర్కొన్నారు. కార్పొరేట్లకు అడవులన్ని దోచిపెట్టేందుకు మావోయిస్టులపై కేంద్రం దాడి చేసిందని విమర్శిం చారు. కార్పొరేట్, మత రాజకీయాలకు ఆటంకంగా ఉన్న కమ్యూనిస్టులపైనా, జర్నలిస్టులపైనా, ప్రశ్నించేవారిపైనా బీజేపీ టార్గెట్ చేసి పనిచేస్తోందని విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని తెలిపారు.






