27 July, 2026 | 10:13 AM

అమెరికాతో చర్చల కోసం ఇరాన్ మూడు షరతులు

27-07-2026 09:41 AM
  1. సీజ్ ఫైర్ చర్చలకు ఇరాన్ 3 షరతులు
  2. అమెరికాతో చర్చలపై పట్టబిగిస్తున్న ఇరాన్
  3. రెండు షరతులు నెరవేరాకే మూడోదశలో చర్చలు 
  4. జెనీవా, దోహా, ఇస్లామాబాద్ లో ఎక్కడైనా చర్చలకు రెడీ అంటున్న ఇరాన్

వాషింగ్టన్: అమెరికాతో కాల్పుల(Ceasefire) విరమణ చర్చలపై ఇరాన్ పట్టుబిగిస్తోంది. అమెరికాతో చర్చలను పునఃప్రారంభించడానికి ఇరాన్(Iran) మూడు ముందస్తు షరతులను విధించింది. హర్మూజ్ జలసంధి తమ నియంత్రణలోనే ఉందని ఐఆర్ జీసీ(Islamic Revolutionary Guard Corps) వెల్లడించింది. హర్మూజ్ పూర్తిగా తమ నియంత్రణలోనే ఉండేందుకు అంగీకరించాలని ఇరాన్ డిమాండ్ చేసింది. కొత్త మార్గాలకు అంగీకరించబోమని ఇరాన్ స్పష్టం చేసింది.

విదేశాల్లో స్తంభించపజేసిన తమ ఆస్తులను తక్షణమే విడుదల చేయాలని కోరింది. రెండు షరతులు నెరవేరాకే మూడో దశలో చర్చలు జరుపుతామని ఇరాన్ చిక్కుముడి పెట్టింది. అణు కార్యక్రమాలపై మూడోదశలో చర్చలు జరుపుతామని టెహ్రాన్ తేల్చిచెప్పింది. జెనీవా, దోహా, ఇస్లామాబాద్ లో ఎక్కడైనా చర్చలకు సిద్ధమని ఇరాన్ ప్రకటించింది. హోర్ముజ్ జలసంధికి(Strait of Hormuz) సంబంధించిన అవగాహన ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చి ఆరోపించారు.

టెహ్రాన్ ఆ ప్రాంతంలో ప్రతీకార దాడులను నిలిపివేసిందని ఇరాన్ సైనిక ప్రతినిధి తెలిపారు. అమెరికా తన కార్యకలాపాలను నిలిపివేసినప్పటి నుండి గత రెండు రాత్రులుగా ఎలాంటి దాడులు జరగలేదని ఆ ప్రతినిధి ధృవీకరించారు. హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న నౌకలను ఇరాన్ లక్ష్యంగా చేసుకోవడంతో ఈ తాజా ఉద్రిక్తత మొదలైంది. ఇది రోజువారీ కాల్పుల మార్పిడికి దారితీసి, జూన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని సమర్థవంతంగా కుప్పకూల్చింది. ఇటీవలి రోజుల్లో, అమెరికా దళాలు ఉన్న స్థావరాలపై ఇరాన్ జరిపిన దాడుల్లో జోర్డాన్‌లో ముగ్గురు, ఇరాక్‌లో ఒకరు అమెరికన్ సైనికులు మరణించారు. ఇదిలా ఉండగా, ప్రాంతీయ పరిస్థితులపై అధ్యక్షుడు ట్రంప్‌తో చర్చలు జరిపేందుకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వాషింగ్టన్‌కు రానున్నారు.