వరి ధాన్యం సేకరణ సజావుగా జరిగేలా ఏర్పాట్లు

11-09-2026 | 05:15am

అధికారులకు కలెక్టర్ ప్రతీక్ జైన్ దిశానిర్దేశం

సంగారెడ్డి, సెప్టెంబర్ 10 : ప్రస్తుత వానాకాలం సీజన్లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సజావుగా సేకరించేందుకు ముందస్తు ప్రణాళికతో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్(District Collector Prateek Jain) అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత శాఖల అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సమన్వయంతో అంకితభావంతో పనిచేయాలని సూచించారు.

202627 వానాకాలం సీజన్లో వరి ధాన్యం సేకరణకు సంబంధించి గురువారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ టి.ఎల్. సంగీతతో కలిసి సంబంధిత శాఖల అధికారులు, రవాణా కాంట్రాక్టర్లతో కలెక్టర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ వానాకాలం సీజన్లో జిల్లాలో సుమారు రెండు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లు తెలిపారు.

దీనికి అనుగుణంగా జిల్లాలో 227 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. సన్న రకంకు దొడ్డు రకం ధాన్యానికి అవసరమైన విధంగా వేర్వేరు  కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. రైతుల పంట దిగుబడి చేతికందే సమయానికి ఆయా ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

రైతులు ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి పూర్తి మద్దతు ధర పొందేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణకు అవసరమైన గన్నీ బ్యాగులను అన్ని కొనుగోలు కేంద్రాల్లో ముందుగానే సిద్ధంగా ఉంచాలని అన్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంగీత, డీఎస్‌ఓ బాలసరోజ, సివిల్ సప్లయిస్ డీఎం జయశ్రీ, డీసీఓ కిరణ్ కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్, జిల్లా మార్కెటింగ్, రవాణా, డీఆర్డీఓ, వేర్హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు