18 April, 2026 | 2:21 AM

హీరోగా.. విలన్‌గా.. జేడీ చక్రవర్తి చేతబడి

18-04-2026 12:00 AM

జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో వాస్తవ సంఘటనల ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ‘చేతబడి’ అనే టైటిల్‌తో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఎం3 మీడియా, మహా మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సూర్యాస్ రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మహర్షి కూండ్ల సమర్పకుడు, మహేంద్ర నాథ్ కూండ్ల  నిర్మాత. బాణామతి నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ హారర్, మిస్టరీ అంశాలతో రూపుదిద్దుకుంటోంది.

ఇప్పటికే ఈ మూవీ ప్రీ లుక్ విడుదలై, సినీప్రియుల్లో ఆసక్తిని రేకెత్తించింది. జేడీ చక్రవర్తి పుట్టినరోజును పురస్కరిం చుకొని ఈ సినిమాలో ఆయన పోషిస్తున్న పాత్రను రివీల్ చేశారు మేకర్స్. మునుపెన్నడూ పోషించని విభిన్న అవతారంలో హీరోగా, విలన్‌గా జేడీ చక్రవర్తి కనిపించనున్నారని చిత్ర యూనిట్ తెలియజేసింది.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాకముందే ఐదు భాషల ఆడియో రైట్స్‌ను సరిగమ సంస్థ దక్కించుకోవడం! ఈ సినిమా వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది. ఈ చిత్రానికి సంగీతం: అచ్చు రాజమణి; పాటలు: చంద్రబోస్; సినిమాటోగ్రఫీ: మిర్లాన్ నజీర్; ఎడిటర్: వంశీ; ఆర్ట్: ఆశిష్ తేజ పూలల.