18 March, 2026 | 9:46 AM

రామాయణలో కుంభకర్ణుడిగా!

18-03-2026 01:41 AM

బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్టు ‘రామాయణ’. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్నారు. అయితే, ఈ చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికర వార్త బీటౌన్‌లో వినవస్తోంది. ప్రముఖ వెబ్ సిరీస్ ‘పంచాయత్’లో ప్రహ్లాద్ చా పాత్రతో ఫేమస్ అయిన నటుడు ఫైసల్ మాలిక్.. ‘రామాయణ’లో కుంభకర్ణుడి పాత్ర ను పోషించబోతున్నట్లు సమాచారం.

గతంలో ఈ పాత్ర కోసం బాబీ డియోల్ పేరు వినిపించినప్పటికీ, ఫైసల్ మాలిక్ భారీ కాయం, సహజ సిద్ధమైన ఆహార్యం ఈ పాత్రకు సరిగ్గా సరిపోతాయని భావించిన చిత్రబృందం ఆయన పేరునే ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఫైసల్ మాలిక్ ముంబైలో తన తొలి షెడ్యూల్ షూటింగ్‌ను కూడా పూర్తి చేశారట. రావణుడిగా నటిస్తున్న కన్నడ స్టార్ యష్‌తో కలిసి ఆయన కీలక సన్నివేశాల్లో నటించారని సమాచారం.

ఈ సినిమాలో కుంభకర్ణుడి పాత్రను అత్యంత భారీగా, విజువల్ వండర్‌గా చూపించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. హాలీవుడ్ చిత్రం ‘అవతార్’ తరహాలో అత్యాధునిక వీఎఫ్‌ఎక్స్ సహాయంతో ఈ పాత్రను డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అంతర్జాతీయ యాక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ బృందం పనిచేస్తోంది. మొత్తానికి ఈ మెగా ప్రాజెక్టులో ఫైసల్ మాలిక్ చేరడం సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ భారీ పౌరాణిక చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడి కానున్నాయి.