అసెంబ్లీ పక్కదారి
- స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలతో గందరగోళం
- శాసన వ్యవస్థ గౌరవం కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
- రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలపై చర్చ కరువు
- వారం రోజుల సమావేశాల్లో రెండు రోజులు పూర్తి
- అధికార, ప్రతిపక్షాల తీరుపై విశ్లేషకుల ప్రశ్నలు
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి) : తెలంగాణ శాసనసభ సమావేశాలు(Telangana Legislative Assembly Sessions) ప్రారంభమైన రెండో రోజుకే రాజకీయ వేడి పతాకస్థాయికి చేరింది. సభ వెలుపలి పరిణామాలు లోపల కూడా గందరగోళానికి దారి తీస్తున్నాయి. శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్(Legislative Assembly Speaker Gaddam Prasad Kumar)పై ప్రతిపక్ష బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు(BRS MLC Tata Madhu) అనుచిత వ్యాఖ్యలు(Inappropriate comments) రాజకీయ దుమారం రేపాయి. మరోవైపు బీఆర్‌ఎస్ మహిళా శాసనసభ్యుల(BRS women legislators) పట్ల పోలీసులు(Police) వ్యవహరించిన తీరుపై విమర్శలకు దారితీశాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షం, పాలకవర్గం మధ్య రాజకీయంగా ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభా ప్రాంగణం వేడెక్కింది.
వాస్తవానికి మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ పదవులు రాష్ట్రానికి సంబంధించిన రాజ్యాంగబద్ధమైన అత్యున్నతమైనవి. కానీ తాజాగా అసెంబ్లీ ఆవరణలో ఆ గౌరవంపై మాయని మచ్చ పడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సభా సంప్రాదాయాలకు విరుద్ధంగా ఒక సభ్యుడు స్పీకర్‌ను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రతిష్ట దిగజారే పరిస్థితి నెలకొంది. ఈ పరిణామానికి ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్ పూర్తిస్థాయిలో బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రజల పక్షాన బీఆర్‌ఎస్ పార్టీ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అనేక పోరాటాలు చేస్తోంది.
అదే తరహాలో అసెంబ్లీలోనూ ప్రభుత్వాన్ని ప్రశ్నించి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఒత్తిడి తీసుకురావాల్సిన తరుణంలో స్పీకర్‌పై పరుష పదజాలం ఉపయోగించడం సభ వ్యవహారాలను పక్కదారి పట్టేలా చేసింది. ప్రభుత్వం కూడా ప్రతిపక్ష సభ్యులను అసెంబ్లీ ఆవరణలోకి రాకుండా నిలువరించడం మరింత గందరగోళానికి దారి తీసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, శాసనసభ ఆవరణలో మహిళా సభ్యుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన, దాడి జరిగిన దానిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
మొత్తంగా ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన ప్రతిపక్షం కలిసి రాష్ట్ర శాసన వ్యవస్థ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వ్యవహరించడంపై అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ప్రజల సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీ సమయాన్ని మొత్తం రాజకీయ వివాదాలకు పరిమితం చేస్తున్నారనే చర్చ జరుగుతున్నది. ఇరుపక్షాలు ఆత్మ పరిశీలన చేసుకోకపోతే శాసన వ్యవస్థకున్న ప్రాముఖ్యత, ప్రాధాన్యతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ప్రజా సమస్యలపై చర్చ ఏదీ?
అసెంబ్లీ సమావేశ సమయంలో ముగిసిన రెండు రోజుల్లో కేవలం ఆరోపణలతోనే గడిచిపోయింది. దీనిపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అనేక సమస్యలతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వారి సమస్యలకు ఏమైనా పరిష్కారం లభిస్తుందేమోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
రైతుల సమస్యపై ఏ నిర్ణయం వచ్చింది? నిరుద్యోగుల సమస్యపై ఏ హామీ వచ్చింది? ఉద్యోగుల సమస్యలపై ఏం చర్చ జరిగింది? 22ఏ నిషేధిత జాబితా సమస్యకు పరిష్కారం లభించిందా? పెండింగ్‌లో ఉన్న సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ఏం చెప్పింది? సాగునీరు, తాగునీరు, విద్యుత్ సమస్యలపై ఏం తేలింది? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఏం స్పష్టత వచ్చింది? వంటి ప్రశ్నలకు సమాధానాలు రావాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ విమర్శలకు అసెంబ్లీ వేదిక కావడం సహజమే.
ప్రభుత్వం తన విధానాలను సమర్థించుకోవాలి. ప్రతిపక్షాలు ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించాలి. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. ఇదే శాసనసభ వ్యవస్థలోని ప్రధాన ఉద్దేశం. కానీ విమర్శలు వ్యక్తిగత దూషణలకు, ఆరోపణలకు, పరస్పర అవమానాలకు దారితీస్తే అసలు సమస్య పక్కకు వెళ్లే ప్రమాదం ఉంటుంది.
ప్రజలు తమ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలను ఎన్నుకుని అసెంబ్లీకి పంపేది కేవలం రాజకీయ పోరాటాలు చేయడానికి కాదు. తమ సమస్యలను సభలో వినిపించి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి, పరిష్కారాలు చూపిస్తారని ఆకాంక్షిస్తారు. అందుకే అసెంబ్లీ సమావేశాల సమయంలో ప్రతి నిమిషం విలువైనదేనని విశ్లేషకులు చెబుతున్నారు.
రచ్చ కాదు.. చర్చ కావాలి..
ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన బాధ్యత ప్రతిపక్షంతోపాటు ప్రభుత్వంపై కూడా ఉంటుంది. ప్రతిపక్షాలు ప్రశ్నలు అడిగితే వాటికి సమాధానం ఇవ్వాలి. ప్రభుత్వ విధానాలపై విమర్శలు వస్తే వాస్తవాలతో వివరణ ఇవ్వాలి. హామీల అమలుపై ప్రశ్నలు వస్తే పురోగతిని వివరించాలి. సమస్యలు పరిష్కరించలేని పరిస్థితి ఉంటే కారణాలను చెప్పాలి. ప్రతిపక్షం సభను అడ్డుకుంటోందని మాత్రమే చెబుతూ ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకోలేదనే అభిప్రాయం ఉంది.
అదే సమయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రతిపక్ష పార్టీల ప్రధాన బాధ్యత. కానీ ప్రతి అంశాన్ని రాజకీయ పోరాటంగా మార్చకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రశ్నలు సంధించాలి. సమస్యను లేవనెత్తడం మాత్రమే కాదు.. పరిష్కారం ఏమిటో కూడా సూచించాలి. అసెంబ్లీలో నిరసనకు ఒక పరిమితి ఉంటుంది. సభా కార్యక్రమాలను పూర్తిగా స్తంభింపజేయడం వల్ల చివరికి నష్టం ప్రజలకే. ఎందుకంటే సభలో చర్చ జరగకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం కూడా తగ్గిపోతుంది.
అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య విభేదాలు ఉండటం సహజం. కానీ ఆ విభేదాలు చర్చకు దారితీయాలి కానీ రచ్చకు కాదు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసే నాటికి ప్రజలకు గుర్తుండాల్సింది ఎవరు ఎవరిని తిట్టారు అన్నది కాదు.. ఏ సమస్యపై ఏం చర్చ జరిగింది, ప్రభుత్వం ఏం సమాధానం ఇచ్చింది, ఎన్ని సమస్యలకు పరిష్కార మార్గం కనిపించింది అనే భావన కలగాలని ఆకాంక్షిస్తున్నారు.
స్పీకర్ వ్యవహారంపై చర్యలు అవసరమే..
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం శాసనసభ గౌరవానికి సంబంధించిన అంశంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. స్పీకర్ అధికార పక్షానికి చెందిన వ్యక్తి అయినా, ప్రతిపక్షానికి చెందిన వ్యక్తి అయినా.. సభాపతి పదవికి ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. ఆ పదవిని కించపరిచే వ్యాఖ్యలు జరిగితే సభా నియమాల ప్రకారం చర్యలు తీసుకోవడం అవసరం. అలాంటి వ్యాఖ్యలను రాజకీయ ప్రయోజనాల పేరుతో సమర్థించడం కూడా సరికాదనే అభిప్రాయం ఉంది.
మహిళా ప్రజాప్రతినిధుల పట్ల ఎలాంటి అనుచిత ప్రవర్తన చోటుచేసుకున్నా అది తీవ్రమైన అంశమే. వాస్తవాలు ఏమిటో తేల్చి, తప్పు ఎవరిదైనా బాధ్యత వహించేలా చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఈ అంశంపై విచారణ, చర్యలు తీసుకోవాల్సిన ప్రక్రియ ఒకవైపు కొనసాగుతూనే.. సభలో మిగిలిన సమయాన్ని ప్రజా సమస్యల చర్చకు వినియోగించా ల్సిన బాధ్యత కూడా పార్టీలపై ఉంటుంది. అందుకే అసెంబ్లీ సమావేశాల దృశ్యాలు మాత్రం ప్రధానంగా రాజకీయ ఘర్షణల చుట్టూనే తిరుగుతున్నాయన్న భావన ప్రజల్లో ఏర్పడితే అది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.