ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి
- ఈ పథకాన్ని ఎత్తేసే కుట్రను మానుకోవాలి
జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య
ముషీరాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ( fee reimbursement scheme) ఎత్తివేసే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని, 14 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన రూ.8 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
మంగళవారం బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులు కాచిగూడ, బర్కత్పుర, నారాయణగూడ మీదుగా భారీ ప్రదర్శన నిర్వహించి చలో అసెంబ్లీ చేపట్టారు. బీసీ విద్యార్థి సంఘం కన్వీనర్లు పర్లగొళ్ల మోడీ రాందేవ్, నిఖిల్ పటేల్, నరేష్ ఆధ్వర్యంలో జరిగిన భారీ ర్యాలీ కార్యక్రమంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై ఏర్పడిన గందరగోళంతో వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని అన్నారు.
సుమారు 600 కాలేజీలు మూతపడ్డాయని, ఇంజినీరింగ్, పీజీ, డిగ్రీలో పెద్ద సంఖ్యలో సీట్లు భర్తీ కాలేదని పేర్కొన్నారు. ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో కోర్సులు పూర్తిచేసిన సుమారు 6 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీల్లోనే ఉన్నాయని తెలిపారు.
ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పాత విధానంలోనే కొనసాగించాలని, బకాయిలు విడుదల చేసే వరకు ఉద్యమం కొనసాగుతుందని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. సమస్యపై ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించి విద్యార్థి, బీసీ సంఘాలు, మేధావులతో చర్చించాలని డిమాండ్ చేశారు.