‘ఆటిజం’ వైద్య సమస్య మాత్రమే కాదు
- మానవ మేధస్సు వైవిధ్యానికి ప్రతిబింబం
- హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి
- ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్ (ఏఎస్‌డీ)పై సదస్సు
- యశోధ హాస్పిటల్స్ హైటెక్ సిటీలో నిర్వహణ
హైదరాబాద్, ఏప్రిల్ 11(విజయక్రాంతి): ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్ (ఏఎస్‌డీ)పై అవగాహనను పెంపొందించడం, సమగ్ర విధాన పరమైన మార్పులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో యశోధ హాస్పిటల్స్ హైటెక్ సిటీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెల్లెక్టువల్ డిసెబిలిటీస్ (ఎన్‌ఐఈపీఐడీ) సహకారంతో నేషనల్ ఆటిజం స్టేక్ హోల్డర్స్ సమ్మిట్ 2026ను నిర్వహించింది.
ఈ రెండు రోజుల జాతీయ సదస్సు ఆటిజం సంరక్షణ, సాధికారతను అభివృద్ధి చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్ జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్ హరిచందన దాసరి ముఖ్య అతిథిగా హాజరై సదస్సును ప్రాంభించారు. ఈ నెల 11,12 తేదీల్లో యశోధ హాస్పిటల్స్ హైటెక్ సిటీలోని 5వ అంతస్తు ఆడిటోరియంలో నిర్వహించారు.దేశవ్యాప్తంగా 500 మందికిపైగా ప్రముఖ పిల్లల నాడీ వైద్య నిపుణులు, న్యూరోసైంటిస్టులు, థెరపిస్టులు, విధాన నిర్ణేతలు, పరిశోధకులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు, ఆటిజం ఉన్న వ్యక్తుల కుటుంబ సభ్యులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
ఈ సదస్సు యశోధ హాస్పిటల్స్ డైరెక్టర్, మెడికల్ సర్వీస్, డాక్టర్. ఎ. లింగయ్య, పీడియాట్రిక్ న్యూరోసైన్సెస్ విభాగం డైరెక్టర్, చైల్ అండ్ అడోలసెంట్ న్యూరాలజిస్టు డాక్టర్. లోకేష్ లింగప్ప మార్గదర్శకత్వంలో, ఎన్‌ఐఈపీఐడీ డైరెక్టర్ డాక్టర్ బీవీ రామ్ కుమార్ సహకారంతో నిర్వహించారు.ఆర్గనైజింగ్ కమిటీలో డెవలప్మెంటల్ పీడియాట్రిషన్, సీడీసీ క్లినికల్ ఇన్చార్జ్ డాక్టర్. అమూల్య మైసూర్, మెడికల్ జెనెటిస్ట్ డాక్టర్. సారా బైలూర్ , సీనియర్ క్లినికల్ సైకాలజిస్టు డాక్టర్. సోమశేఖర్ ఉన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ హరిచందన దాసరి మాట్లాడుతూ నేషనల్ ఆటిజం స్టేక్ హోల్డర్స్ సమ్మిట్-2026లో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.ఆటిజం అనేది కేవలం వైద్య సమస్య మాత్రమే కాదని మానవ మేధస్సు వైవిధ్యానికి ప్రతిబింబమని పేర్కొన్నారు. విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాల్లో సమగ్ర విధానాలను అమలు చేయడం ద్వారా అవగాహన దశను దాటి ముందుకు సాగాల్సిన అవసరాన్ని ఆమె నొక్కి చెప్పారు.
ఇలాంటి కార్యక్రమాలు సమాన అవకాశాలతో కూడిన సమగ్ర సమాజ నిర్మాణానికి దోహదపడతాయని ఆమె తెలిపారు.అదే రోజున, పిల్లల అభివృద్ధి, ప్రవర్తనా సమస్యల ప్రారంభ గుర్తింపు, చికిత్స కోసం అత్యాధునిక సదుపాయాలతో రూపొందించిన చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ (సీడీసీ)ను ఆమె ప్రారంభించారు.
ఈ కేంద్రం పిల్లలు,వారి కుటుంబాలకు అంచనా, థెరపీ, నిరంతర సహాయం అందించేందుకు మల్టీడిసిప్లినరీ నిపుణులను ఒకచోట చేర్చిందని కలెక్టర్ హరిచందన దాసరి తెలిపారు. యశోధ హాస్పిటల్స్ డైరెక్టర్, మెడికల్ సర్వీస్, డాక్టర్. ఎ. లింగయ్య మాట్లాడుతూ, ఆటిజాన్ని సమాజం మొత్తం బాధ్యతగా చూడాల్సిన అవసరం ఉందని, అవగాహన, ప్రారంభ నిర్ధారణ,నాణ్యమైన చికిత్సపై మరింత దృష్టి పెట్టాలని అన్నారు.
ఆటిజం సంరక్షణలో మల్టీడిసిప్లినరీ విధానం ఎంతో ముఖ్యమన్నారు. ఇలాంటి సదస్సులు నిపుణుల మధ్య జ్ఞాన మార్పిడికి వేదికగా నిలిచి, మెరుగైన చికిత్స ఫలితాలకు దారితీస్తాయన్నారు.విద్య, ఉపాధిలో అందుబాటు, సమగ్ర విధా నాలు,సామాజిక అంగీకారం ద్వారా ఆటిజం ఉన్న వ్యక్తులను సాధికారత కల్పించాల్సిన అవసరాన్ని ఆయన హైలైట్ చేశారు. ఈ సమ్మిట్ ఆ దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా ఆయన అభివర్ణించారు.
యశోధ హాస్పిటల్స్ హైటెక్ సిటీలో సీనియర్ చైల్డ్ అండ్ అడోలసెంట్ న్యూరాలజిస్టు డాక్టర్ లోకేష్ లింగప్ప మాట్లాడుతూ ఆటిజం వంటి సంక్లిష్ట న్యూరోడెవలప్మెంటల్ సమస్యలు తొలిదశలో గుర్తింపు, సమగ్ర చికిత్స ఎంతో ముఖ్యమన్నారు.ప్రారంభ దశలో చేసే జోక్యం పిల్లల అభివృద్ధి,జీవన నాణ్యతను గణనీయంగా మెరుగుపరుస్తుందన్నారు. ఈ సమ్మిట్ వైద్య నిపుణులు, విద్యావేత్తలు, విద్యార్థులు,కుటుంబ సభ్యులను ఒకచోట చేర్చి, ఆరోగ్యం, విద్య,విధాన రంగాల్లో సహకారాన్ని పెంపొందించే ఒక ముఖ్య వేదికగా నిలిచిందని పేర్కొన్నారు.




