భారత్‌పై అవాకులు.. చవాకులు
ఓవరాక్షన్ చేసిన యూట్యూబర్
లండన్, ఆగస్టు 23: యూకేకు చెందిన ఓ యూట్యూబర్ ఓవరాక్షన్ చేశాడు. ఇండియాతో పాటు మరికొన్ని దేశాల గురించి ప్రస్తావిస్తూ అవాకులు.. చవాకులు పేలాడు. ఇది చూసిన నెటిజనం ఆ యూట్యూబర్ మీద దుమ్మత్తి పోస్తున్నారు. యూకేకు చెందిన యూట్యూబర్ మైల్స్ రూట్‌లెడ్జ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘నేను బ్రిటన్ ప్రధాని అయ్యాక.. మా దేశ ప్రయోజనాలకు ఆటంకం కలిగించే విదేశీ శక్తికి అణుమార్గంలోనే సమాధానం ఉంటుందని స్పష్టమైన హెచ్చరికలు చేస్తాను. పెద్ద ఘటనలు జరిగే వరకు చూస్తూ ఊరుకోను. చిన్నపాటి ఉల్లంఘనలకే నేను ఆ దేశాలపై అణ్వాయుధాలు ప్రయోగిస్తాను’ అని వ్యాఖ్యానించాడు. ఆ విదేశాల జాబితాలో భారత పేరును చేర్చడమే కాకుండా ఆ దేశమంటే తనకు ఇష్టం లేదని కూడా కామెంట్ చేశాడు. దీంతో అతడిపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శవాల మీద పేలాలు..
ఇలాంటి వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ మైల్స్‌ది శవాల మీద పేలాలు ఏరుకునే బుద్ది. ఏ దేశంలో సంక్షోభం ఎదురైతే ఆ దేశంలో మైల్స్ వాలిపోతుంటాడు. అక్కడి ప్రజల బాధలను చూపిస్తున్నాను అని కలరింగ్ ఇస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు. అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్లు ప్రభుత్వాన్ని కూల్చేసి దేశాన్ని తమ కంట్రోల్‌లోకి తెచ్చుకున్న సమయంలో కూడా బ్రిటన్ వద్దంటున్నా వినకుండా అక్కడికి వెళ్లి.. చిక్కుకుపోయాడు. దీంతో బ్రిటన్ ఆర్మీ అతడిని రక్షించింది. ఆ తర్వాత కూడా మైల్స్ తన తీరు మార్చుకోలేదు. సంక్షోభం వచ్చిన దేశంలో వాలిపోతూ ఇలా ఏదోటి వాగుతూ కొత్త వివాదాలకు కారణం అవుతుంటాడు.






