సముద్రం ఒడ్డుకు సీలయన్స్
- మాంటెరీ శాన్‌కార్లోస్ బీచ్‌లో ప్రత్యక్షమైన క్షీరదాలు
- వాటిని చూసేందుకు ఆసక్తికనబరిచిన పర్యాటకులు
శాక్రమెంటో, ఆగస్టు 23: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని మాంటెరీ శాన్‌కార్లోస్ బీచ్ ఒడ్డుకు గురువారం వందలాది సంఖ్యలో సీ లయన్స్ వచ్చి సేద తీరాయి. దీంతో స్థానిక యంత్రాంగం బీచ్‌లోకి పర్యాటకుల ప్రవేశాన్ని నిషేధించింది. వాటిని చూసేందుకు స్థానికులు ఆసక్తి కనబరిచారు. తమ మొబైల్స్‌లో వాటి ఫొటోలు తీసుకుని సంబురపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీ లయన్స్ బీచ్ ఒడ్డుకు వచ్చాయని, అవి ఈ బీచ్‌ను ఎందుకు ఎంచుకున్నాయో తెలియడం లేదని అధికారులు తెలిపారు. సీలయన్స్ రాకపై మోంటరీ బే నేషనల్ మెరైన్ శాంక్చుయరీ శాస్త్రవేత్త లిసా ఉట్టల్ స్పందిస్తూ.. సీలయన్స్ క్షీరదాలని, ఇవి సాధారణ సముద్ర జంతువులకంటే వైవిధ్యమైన ఆహారాన్ని కోరుకుంటాయని తెలిపారు.
ఇవిఎల్ల ప్పుడూ సముద్రమంతా సంచరించేందుకు ఇష్టపడతాయన్నారు. ఇవి వెంచురా, చానల్ దీవుల నుంచి ఈ బీచ్‌కు చేరుకున్నాని స్పష్టం చేశారు. ఒడ్డుకు చేరుకున్న సీలయన్స్ అన్నీ మగవి కావడం మరో విశేషమన్నారు. అందు కు కచ్చితమైన కారణమెంటో తెలియడం లేదన్నారు. అవి సుమారు నెల రోజుల పాటు బీచ్‌లోనే ఉండే అవకాశం ఉందన్నారు. సీలయన్స్ జీవవైవిధ్యంలో కీలక పాత్ర పోషిస్తా యని, అమెరికా ప్రభుత్వం వాటిని 1972 సముద్ర క్షీరదాల చట్టం ద్వారా పరిరక్షిస్తున్నదని తెలిపారు. వాటిని పట్టుకునేందుకు ప్రయత్నించడం చట్టరీత్యా నేరమన్నారు.






