22 April, 2026 | 8:33 AM

త్రిపురలో వరద బీభత్సం

24-08-2024 01:32 AM
  1. 22కి చేరిన మృతుల సంఖ్య 
  2. 65వేల మందికి పైగా నిరాశ్రయులు 
  3. ప్రమాదకర స్థాయిలో నదుల నీటిమట్టం

న్యూ ఢిల్లీ, ఆగస్టు 23: ఈశాన్య రాష్ట్రం త్రిపురలో ఓ వైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పోటెత్తిన వరద.. మరోవైపు కొండచరియలు విరిగిపడుతుండటంతో శుక్రవారం వరకు దాదాపు 22మంది చనిపోయారు. రాష్ట్రంలోని పలు నదుల్లో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తుండటంతో చుట్టపక్కల ప్రాంతాల వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు. వరదల కారణంగా దాదాపు 65వేల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారని అధికారిక సమాచారం. వేల ఎకరాల్లో పంట పాడవగా, ఇప్పటికే పండించిన ధాన్యం నీటిపాలైంది.

డిజాస్టర్ మేనేజ్‌మెంట్ లెక్కల ప్రకారం ఇక్కడ 2,032 ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడగా.. వాటిలో 1,789 ప్రాంతాలు క్లియర్ చేశారు. మిగితా చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరదల్లో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు అరుణాచల్‌ప్రదేశ్ నుంచి వచ్చిన నాలుగు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహా స్థానిక సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. వరద ఎక్కువగా ఉన్న సమస్యాత్మక ప్రాంతాల్లో రెండు ఎంఐ హెలికాఫ్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సాహా సోషల్ మీడియా వేదికగా.. చనిపోయిన బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడటంతో పాటు వారికోసం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు.