పసిగుడ్లు అగ్నికి ఆహుతి
ఢిల్లీ దవాఖానలో ఘోర అగ్నిప్రమాదం
ఏడుగురు నవజాత శిశువులు మృతి
మెరుపు వేగంతో స్పందించిన స్థానికులు.. ప్రాణనష్టం తగ్గింపు
నేర చరిత్ర కలిగిన దవాఖాన యజమాని.. అరెస్టు
అప్పుడే పుట్టిన పసిగుడ్లు.. వారాల వయసు కూడా లేని పసిమొగ్గలు.. తమ చుట్టూ ఏం జరుగుతుందో తెలియక ఆదమరి నిద్రపోతున్న ఆ పసిమొగ్గలపై అగ్నికీలకలు విరుచుకుపడ్డాయి. ఆ వేడికి మాడిపోతూ ఆ నవజాత శిశువులు గుక్కపెట్టి ఏడుస్తూనే అనంతవాయువుల్లో కలిసిపోయారు. బిడ్డ పుట్డాడన్న సంతోషంలో ఉన్న ఆ తల్ల్లిదండ్రుల కండ్లముందే తమ కలలు కల్లలైపోతుంటే వారి బాధ వర్ణనాతీతం. వారి ఆక్రందనలు, ఆక్రోశాలు ఆలకించేవారే కరువయ్యారు.
ఢిల్లీ, మే 26: దేశ రాజధాని ఢిల్లీలోని ఓ దవాఖానలో శనివారం రాత్రి చోటుచేసుకొన్న ఘోర అగ్నిప్రమాదం ఏడుగురు నవజాత శిశువులను బలితీసుకొంది. వారి కన్నవారికి తీరని శోకాన్ని మిగిల్చింది. దవాఖాన యజమాని అలసత్వం, నిర్లక్ష్యంతో అప్పుడే పుట్టిన బిడ్డలు దవాఖాన పడక నుంచి బయటకు రాకుండానే కాటికి వెళ్లిపోయారు. తూర్పు ఢిల్లీలోని వివేక్ విహార్‌లో ఉన్న బేబీకేర్ న్యూబోర్న్ హాస్పిటల్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ముక్కుపచ్చలారని శిశువులు చనిపోయారు. దవాఖాన మొత్తం అగ్నికి ఆహుతైంది.
ఈ ఘటనలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడగా వారికి చికిత్స అందిస్తున్నారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలి పారు. ఈ ఘటనకు బాధ్యుడైన దవాఖాన యజమాని నవీన్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నవీన్ ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పిల్లల దవాఖానలు నిర్వహిస్తున్నారని తెలిపారు. శనివారం రాత్రి 11.32 గంటలకు మంటలు చెలరేగాయి. అక్కడే ఉన్న నాలుగైదు ఆక్సిజన్ సిలిండర్లు పేలడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. మూడంతస్థుల ఆ భవనంలో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న పోలీ సులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్య లు చేపట్టారు.
మొదటి అంతస్థులో ఉన్న 12 మంది నవజాత శిశువులను బయటికి తీసుకువచ్చారు. కానీ, అప్పటికే ఏడుగురు మర ణించినట్లు గుర్తించారు. మిగిలిన వారికి చికిత్స అందిస్తున్నారు. దాదాపు 3 గంటలు కష్టపడి మంటలను అదుపుచేశారు. ఈ ఘటనపై అగ్నిమాపక దళం చీఫ్ అతుల్ గార్గ్ మాట్లాడుతూ.. ‘లోపల ఎంతమంది శిశువులు ఉన్నారో ఎక్కడున్నారో తెలియదు. ఆ మంటల మధ్య వారిని కాపాడటం ఎంతో సవాలుగా మారింది. ఎలక్ట్రిక్ పోల్ నుంచి మొదట అగ్గి రాజుకుంది. పక్కనే ఉన్న ఓ వాహనానికి అంటుకున్న మంటలు ఆక్సిజన్ సిలిండర్లకు తాక డంతో ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడ్డాయి’ అని వివరించారు.
స్థానికులే హీరోలు
దవాఖాను మంటలు అంటుకున్న వెంటనే స్థానిక ప్రజలు మెరుపు వేగంతో స్పందించారు. లోపల ఉన్న శిశువులను, వారి బంధు వులను బయటకు తీసుకొచ్చేందుకు వీలైన అన్ని మార్గాలను వెదికారు. అగ్నిమాపక శకటాలు, పోలీసులు అక్కడికి చేరుకొనేటప్పటికే స్థానికులు సహాయ చర్యలు ముమ్మరం చేశారు. దీంతో మరణాల సంఖ్య చాలావరకు తగ్గిందని అధికారులు తెలిపారు.
వైద్యుడి నేరచరిత్ర పెద్దదే
అగ్నిప్రమాదం జరిగిన దవాఖాన యజమానిక నవీన్ రోగుల ప్రాణాలంటే లెక్కేలేదని ఆయన గత చరిత్ర చూస్తే తెలుస్తుంది. అతడు నగరంలో పలు చోట్ల దవాఖానలు నిర్వహిస్తున్నాడు. అయితే, ఎక్కడా నిబంధనలు పాటించిన దాఖలాలు లేవని పోలీసులు తెలిపారు. ౨౦౨౧లో ఆయనపై ఐపీసీ సెక్షన్లు ౩౨౫ (ఉద్దేశపూర్వకంగా ఇతరులను తీవ్రంగా గాయపర్చటం), ౫౦౬ (నేరపూరిత చర్య), ౩౪ (సమూహంగా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడటం) వంటి కఠిన సెక్షన్లతోపాటు జువెనైల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ ౭౫ (ఉద్దేశపూర్వకంగా బాలలను నిర్బంధించటం, హింసించటం, నిర్లక్ష్యం వహించటం) కింద కేసు నమోదైంది. ఆయన తన దవాఖాన నిర్వహణకు అనుమతి కూడా తీసుకోలేదని తేలింది. గతంలో నవజాత శిశువులకు వైద్యం అందించటంలో తీవ్ర నిర్లక్ష్యం వహించాడని పోలీసులు తెలిపారు.






