24 May, 2026 | 12:51 AM

బక్రీద్‌ను శాంతియుతంగా జరుపుకోవాలి

24-05-2026 12:00 AM

ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సుమతి

మేడ్చల్, మే 23 (విజయక్రాంతి): బక్రీద్‌ను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సుమతి అన్నారు. నేరెడ్‌మెట్ సీపీ కార్యాలయంలో బక్రీద్ పండుగ నేపథ్యంలో వివిధ విభాగా(మల్కాజిగిరి మున్సిపాలిటీ, వెటర్నరీ డాక్టర్, రెవెన్యూ, వాటర్ వర్క్స్, అగ్నిమాపక శాఖ, మెడికల్, రోడ్డు రవాణాశాఖ)లతో కలిసి ముస్లిం, గోరక్షక్ సభ్యులతో విడివిడిగా సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ.. బక్రీద్ వంటి ముఖ్యమైన పండుగలను పరస్పర సహకారంతో జరుపుకోవడం వల్ల సమాజంలో ఐక్యతకు ప్రతీక అన్నారు. పండుగ రోజుల్లో ఎలాంటి అపోహలు, వదంతులు వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరారు. అనుమానాస్పద వాహనాలు, అక్రమరవాణా, చట్టవ్యతిరేక కార్యకలాపాల వంటివి దృష్టికి వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. చట్టాన్ని చేతుల్లో తీసుకోవద్దని కోరారు.

గోవులను తరలించే వాహనాలను అడ్డుకోవడం, వ్యక్తులపై దాడులు చేయడం, బలవంతంగా తనిఖీలు చేయడం వంటి చర్యలకు పాల్పడరాదని గో సభ్యులకు సూచించారు. ప్రభుత్వం అనుమతించిన ప్రదేశాల్లోనే జంతువధ నిర్వహించాలని, బహిరంగ ప్రదేశాలలో జంతు అవశేషాలు ఉంచకుండా పరిశుభ్రత పాటిస్తూ మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ డీసీపీ అనురాధ, మల్కాజిగిరి డీసీపీ సీహెచ్ శ్రీధర్, ఉప్పల్ డీసీపీ సురేష్, ఎస్బీ డీసీపీ జీ నరసింహారెడ్డి, ఉమెన్ సేఫ్టీ డీసీపీ ఉషారాణి, అడ్మిన్ డీసీపీ ఇందిరా, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసులు, హెడ్ క్వార్టర్ డీసీపీ శ్యాంసుందర్, అడిషనల్ డీసీపీలు పాల్గొన్నారు.