24 May, 2026 | 1:28 AM

సీఏల పాత్ర కీలకం

24-05-2026 12:33 AM
  1. ట్యాక్స్‌లు, జీఎస్టీ, వ్యాపారాల విస్తరణలో వారి అవసరం పెరుగుతోంది
  2. సీఏలు ఏఐని వృత్తిలో భాగం చేసుకోవాలి 
  3. ఐసీఏఐ స్నాతకోత్సవంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు

హైదరాబాద్, మే 23 (విజయక్రాంతి) : దేశ ప్రగతిలో చార్టర్డ్ అకౌంటెంట్ల (సీఏ) పాత్ర అత్యంత కీలకంగా మారుతోందని, పన్నుల లెక్కలకే పరిమితం కాకుండా వ్యాపారాలను వృద్ధి చేసే సలహాదారులుగా ఎదగాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆకాంక్షించా రు. ముఖ్యంగా ట్యాక్స్‌లు, జీఎస్టీ, వ్యాపారాల విస్తరణలో సీఏల అవసరం చాలా ఉందని, అదుబాటులోకి వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని వృత్తిలో రాణించాలని సూచించారు.

గచ్చిబౌలిలో ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ)’ స్నాతకోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 15 సంవత్సరాల క్రితం సీఏ అవసరం చాలా తక్కువగా ఉండేదన్నారు. సీఏలో కఠినత్వం వల్ల గతంలో ఆ కోర్సు తీసుకోవడానికి చాలా మంది వెనుకంజ వేసేవారని పేర్కొన్నారు. ఇప్పుడా పరిస్థి తి లేదని, కఠినమైన కోర్సులను కూడా పట్టుదలతో అధిగమిస్తున్నారని తెలిపారు.

సీఏ కా వాలంటే కేవలం పరీక్ష పాస్ అయితే సరిపోదని, తీవ్రమైన ఒత్తిడిని, వైఫల్యాలను తట్టు కొ ని చదివి చదవాలన్నారు. అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అంశాలపైన పట్టు సాధించాలన్నారు. పెరుగుతున్న సాంకేతికత వల్ల మనిషి ఉత్పాదకత కూడా భారీగా పెరుగుతుందన్న నమ్మకం తనదని, అందుకు మారుతున్న వ్యవస్థలు, టె క్నాలజీ, సీఏల పనితీరుకు కూడా ఎంతగానో ఉపయోగపడుతాయని కేటీఆర్ స్పష్టం చేశారు. 

స్టార్టప్‌లు గణనీయంగా పెరిగాయి

దేశంలో ప్రస్తుతం వ్యాపారాలతో పాటు స్టార్టప్‌ల సంఖ్య గణనీయంగా పెరిగిందని, యువత  స్వతహాగా వ్యాపార, వాణిజ్య అవకాశాలను సృష్టించుకుంటున్నారని కేటీఆర్ పే ర్కొన్నారు. వారికి సీఏల మార్గదర్శనం, మద్ద తు తప్పనిసరి అవసరం అవుతుందన్నారు. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు పెరిగితే ప్రై వేట్ సంస్థలకే కాకుండా, ప్రభుత్వాలకు కూడా భారీగా ఆదాయం వస్తుందని, తద్వారా ప్రజల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు చే యూత లభిస్తుందన్నారు.

తెలంగాణ దేశంలోనే విజయవంతమైన స్టార్టప్ స్టేట్‌గా ఎది గిందన్నారు. 2014 నుంచి 2023 వరకు ప న్నుల ద్వారా రాష్ట్ర రెవెన్యూ  37 శాతం పైగా వృద్ధి చెందిందని, ఇది భారతదేశంలోని ఏ ఇ తర రాష్ట్రంతో పోల్చుకున్నా అత్యధికమన్నారు. దీంతో పాటు మొత్తం ఆదాయ అభివృద్ధి సుమారు 14 శాతం ఉంటే, అది 24 శాతానికి చేరిందన్నారు.

రాష్ట్ర తలసరి ఆదాయం తెలంగాణ ఏర్పడడానికి ముందు రూ.94,000 ఉంటే, 2023 నాటికి గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, హర్యానా వంటి రాష్ట్రాలను అధిగమించి రూ.3లక్షలకు పైగా పెరిగిం దన్నారు.  అనంతరం సీఏలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కేటీఆర్ అభినందించారు.

భవిష్యత్‌లో రాబోయే సవాళ్లను ధైర్యంగా ఎ దుర్కోగలమని నిరూపించుకున్నారని వారిని ప్రశంసించారు.  ఈ స్థాయికి రావడానికి తల్లిదండ్రులు చేసిన త్యాగాలను మరవకూడదని, మీ ఎదుగుదలతో వారి పాత్రను ఎప్పటికీ గు ర్తుంచుకుంటూ ముందుకు సాగాలనారు.  విద్యార్థులకు సీఏ పట్టాలు అందించారు.