31 May, 2026 | 1:35 AM

బాల్క సుమన్ అరెస్ట్

31-05-2026 01:01 AM
  1. సింగరేణిపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో కేసు నమోదు
  2. తెలంగాణ భవన్ వద్ద అదుపులోకి
  3. ఏడు గంటల పాటు పోలీసుల విచారణ
  4. హిమాయత్‌నగర్‌లో జడ్జి ఎదుట హాజరుపరిచిన పోలీసులు
  5. అర్ధరాత్రి దాటినా కొనసాగిన విచారణ  

హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను నాంపల్లి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సింగరేణిపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ భవన్‌లో బాల్క సుమన్ ఉన్నారన్న సమాచారం తో పోలీసులు అక్కడికి చేరుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులతో బీఆర్‌ఎస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

పోలీసులు గో బ్యాక్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఆ తర్వాత పోలీసులతో బీఆర్‌ఎస్ లీగల్ కమిటీ న్యాయవాదులు మాట్లాడారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్‌పై నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో నాన్ బెయిలబుల్ కేసు నమోదైందని, ఎలాం టి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని అబిడ్స్ ఏసీపీ తెలిపారు. పోలీసులు భారీగా మోహరించడంతో కొంత సమయం తర్వాత బాల్క సుమన్ తెలంగాణ భవన్ నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు.

అనంతరం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొని నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఏడు గంటల పాటు విచారణ చేసి ఆయన వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. అనంతరం వైద్య పరీక్షల కోసం కింగ్ కోఠి ఆస్పత్రికి తరలించారు. ఆ తరువాత హిమాయత్‌నగర్‌లోని మెజిస్ట్రేట్ ఎదుట ఎదుట హాజరుపరిచ్చారు. కాగా అర్ధరాత్రి దాటినా విచారణ కొనసాగింది.   

ప్రభుత్వం నన్ను టార్గెట్ చేసింది : బాల్కసుమన్

‘కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను టార్గెట్ చేసింది. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ నాపై 250కి పైగా కేసులు పెట్టారు. ఇటీవల క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎన్నిక సమయంలోనూ జైలుకు పంపారు. జైలులో నాకు అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. కనీస వసతులు కల్పించకుండా ఇబ్బంది పెట్టారు’ అని బాల్క సుమన్ తెలిపారు. అయినా సరే, ప్రభుత్వ మోసాలపై ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.

సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు, కుంభకోణాల గురించి ప్రభుత్వాన్ని నిలదీసినందుకు, మరోసారి నన్ను జైలుకు పంపాలని రేవంత్‌రెడ్డి, వివేక్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 2014 ఎంపీగా, 2019లో ఎమ్మెల్యేగా గెలిచానని, ఓడినా ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్నానని పేర్కొన్నారు.

మిలిటెంట్ తరహా ఉద్యమ పిలుపే కారణం!

ఇటీవల జరిగిన బీఆర్‌ఎస్ నేతల అంతర్గత సమావేశంలో బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నిరసనలు తెలిపేందుకు రైతులు, కార్మికులు రావడం లేదని.. బీఆర్‌ఎస్ నేతలే స్వయంగా మిలిటెంట్ తరహా ఉద్యమం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అవసరమైతే రోడ్లపై కి వచ్చి గొడవలు చేయాలని, సింగరేణి ఆఫీసును ధ్వంసం చేయాలంటూ కార్యకర్తలను రెచ్చగొట్టేలా మాట్లాడారు.

ఈ వ్యాఖ్యల నేపథ్యంలో బాల్క సుమన్‌పై 326(జీ), 351(3), 353(1)(బీ), ఆర్/డబ్ల్యూ55, ఆర్/డబ్ల్యూ 61(2)(ఏ), బీఎన్‌ఎస్ 4 పీడీపీపీఏ కింద కేసు నమోదైంది. ఆనంద్ అనే వ్యక్తి బాల్క సుమన్‌పై నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బొగ్గు గని కార్మికుల సమావేశంలో బాల్క సుమన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘సింగరేణిని తగలపెట్టండి. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ఆఫీ సులను తగలబెడదాం.. నెల రోజులు జైలుకు పోయి వస్తాము’ అని బాల్క సుమన్ కామెం ట్లు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.