- అట్టహాసంగా అమ్మవారి కల్యాణ మహోత్సవం
- రాష్ట్రప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి కొండా సురేఖ
- అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
‘ఏడేడు రంగుల చీరె తెచ్చినమ్మా’ అంటూ వేలాదిగా తరలివచ్చిన భక్తులు ప్రణమిల్లారు. ‘బల్కంపేట ఎల్లమ్మో.. బంగారు తల్లి ఎల్లమ్మా’ అంటూ మనసారా కొలిచారు. ‘బావిల పుట్టినవమ్మా.. ఎల్లమ్మా’, ‘ఎల్లు ఎల్లు తల్లి ఓ ఎల్లమ్మ తల్లి’ అంటూ మొక్కులు చెల్లించుకున్నారు. ఇలా నగరంలోని బల్కంపేట ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నది. అమ్మవారి కల్యాణ మహోత్సవం అంబరాన్నింటింది. భక్తుల పాలిట కొంగు బంగారమైంది.
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 9 (విజయక్రాంతి): బోనాల పండుగ తర్వాత హైదరాబాద్ మహానగరంలో అట్టహా సంగా జరిగే ఉత్సవం బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం. మంగళవారం ఆల య సన్నిధిలో కనుల పండువగా అమ్మవారి కల్యాణ మహోత్సవం జరిగింది. అర్చకులు అమ్మవారిని 27 చీరలు, స్వామివారికి 11 పంచెలతో అలంకరించారు. కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు ఆలయానికి పోటెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
వేడుకలను కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తిలకించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ఆలయ నిర్వాహకులు, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశమంతటా ప్రకృతి వైపరీత్యాలు లేకుండా చూడాలని అమ్మవారికి మొక్కినట్లు మీడియాకు తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని వేడుకున్నట్లు వెల్లడించారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి కేంద్రం కేటాయించిన రూ. 4.5 కోట్లను రాష్ట్రప్రభుత్వం సద్వినియోగం చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు.
మంత్రి పొన్నం అసహనం..
భక్తుల రద్దీకి తగినట్లుగా ఏర్పాట్లు చేయడంలో ఆలయ నిర్వాహకులు విఫలమైన ట్లు స్పష్టంగా కనిపించింది. అలాగే వీఐపీల గౌరవానికి తగినవిధంగా ఏర్పాట్లు లేకపోవడం తో మంత్రి పొన్నం ప్రభాకర్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి భక్తులు బారులు తీరే క్యూ లైన్‌లోనే వేచిచూడాల్సి వచ్చింది. ఈ సమయంలో తోపులాట జరగడంతో మంత్రి, మేయర్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో వారు క్యూ లైన్ నుంచి బయటకు వచ్చి రోడ్డు డివైడర్‌పై కూర్చున్నారు. ప్రొటోకాల్ లేకపోవడంపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్ దీంతో మంత్రిని బతిమిలాడి వేడుకలకు ఆహ్వానించారు. మరోవై పు అధికారులు, పోలీసులు శివసత్తులను పట్టించుకోలేదని, బోనంతో వచ్చిన తనను ట్రాఫిక్ ఆంక్షల పేరుతో గంట పాటు తిప్పించారని జోగిని శ్యామల అసహనం వ్యక్తం చేశారు.