టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా
న్యూఢిల్లీ: టీమిండియాకు బీసీసీఐ(Board of Control for Cricket in India) భారీ నజరానా ప్రకటించింది. మూడో టీ20 ప్రపంచ కప్ విజయం( T20 World Cup 2026 win) తర్వాత భారత జట్టు మొత్తానికి బీసీసీఐ మంగళవారం రూ.131 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. 2026 టీ20 ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకున్న భారత జట్టుకు 131 కోట్ల రూపాయల భారీ నగదు బహుమతిని ప్రకటించడం ద్వారా భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) తన రికార్డును తానే బద్దలు కొట్టింది.
రోహిత్ శర్మ(Rohit Sharma) నాయకత్వంలో బార్బడోస్‌లో జరిగిన 2024 టీ20 ప్రపంచ కప్‌ను భారత జట్టు గెలుచుకున్నప్పుడు బీసీసీఐ బోర్డు 125 కోట్ల రూపాయల నగదు బహుమతిని ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) సారథ్యంలోని జట్టు అహ్మదాబాద్‌లో చరిత్ర సృష్టించి టైటిల్‌ను విజయవంతంగా నిలుపుకున్న మొదటి జట్టుగా అవతరించడంతో బీసీసీఐ నజరానాను మరింత పెంచి ప్రకటించింది.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో(Narendra Modi Stadium) జరిగిన ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి భారత్ ప్రతిష్టాత్మక ట్రోఫీని సొంతం చేసుకుంది. టోర్నమెంట్ చరిత్రలో ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్‌ను(ICC Men's T20 World Cup 2026) నిలబెట్టుకున్న తొలి జట్టుగా నిలిచింది. ఈ విజయంతో, భారతదేశం ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్‌ను మూడుసార్లు గెలుచుకున్న మొదటి జట్టుగా కూడా నిలిచింది. టీ20 ఫార్మాట్ చరిత్రలో భారత్ అత్యంత విజయవంతమైన జట్లలో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.




