ఘనంగా బసవేశ్వర స్వామి జయంతి ఉత్సవాలు
తాడ్వాయి, ఏప్రిల్, 20 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో సోమవారం అక్షయ తృతీయ సందర్భంగా బసవేశ్వర స్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తాడ్వాయి మండలంలోని చిట్యాల, నందివాడ, ఆరుగొండ, బసనపల్లి,కొండాపూర్ సోమారం గ్రామాలలో జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా బసవేశ్వర స్వామి విగ్రహాలకు, ఫోటోలకు పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతినిధులు మాట్లాడుతూ... మనిషి శుద్ధిగా ఉంటే దేవుడు మనలోనే ఉంటాడు, జాతి కాదు మనిషి గుణమే అతని విలువను నిర్ణయిస్తుందని బసవేశ్వరుడు బోధించాడని తెలిపారు. దేవుడిని ఆలయంలో కాదు మన హృదయంలో చూడాలని బసవేశ్వరుడు ఎన్నో బోధనలు సమాజానికి బోధించారని వివరించారు. ఈ కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ నాయకులు, గ్రామ పెద్దలు,సర్పంచులు పాల్గొన్నారు.






