4 August, 2026 | 3:11 AM

అధ్వాన్నంగా ఏడుల్లా బయ్యారం క్రాస్ రోడ్డు!

04-08-2026 01:58 AM
  1. పారిశుధ్యం పడకేసి.. నీరు వృథాగా పారేసి!
  2. ఒకచోట దుర్గంధం వెదజల్లుతున్న కుక్క కళేబరం.
  3. మరోచోట మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజీ.. వీధుల పాలవుతున్న తాగునీరు.
  4. రోడ్డుకు ఇరువైపులా నిలిచిన బురద నీరు.. పొంచి ఉన్న రోగాల ముప్పు.
  5. పట్టించుకోని అధికారులు.. 
  6. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు

పినపాక, ఆగస్టు 3 ( విజయక్రాంతి) ఏడుల్లా బయ్యారం క్రాస్ రోడ్డు సమస్యలకు నిలయంగా మారింది. నిత్యం వందలాది మంది ప్రయాణికులు, వాహనదారులు సంచరించే ఈ ప్రధాన కూడలి అధికారుల అలసత్వం వల్ల తీవ్ర దుర్భరంగా తయారైంది. పారిశుధ్య లోపం, నీటి వృథా, మురుగు నీటి నిల్వలతో రోడ్డుపై వెళ్లాలంటేనే ప్రజలు నరకం చూస్తున్నారు.

పారిశుధ్యం పడకేసింది.. దుర్గంధంతో ప్రయాణికుల అవస్థలు

క్రాస్ రోడ్డు పరిధిలోని ఒక ప్రాంతంలో కుక్క కళేబరం పడి ఉండి రోజులు గడుస్తున్నా పారిశుధ్య సిబ్బంది తొలగించకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఎండల తీవ్రతకు కళేబరం కుళ్లిపోయి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. దాంతో ఆ మార్గంలో నడిచే పాదాచారులు, వ్యాపారులు ముక్కు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వీధుల పాలవుతున్న ’మిషన్ భగీరథ’ సురక్షిత జలాలు

మరోవైపు, క్రాస్ రోడ్డు వద్ద మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజీకి గురై సురక్షితమైన తాగునీరు వృథాగా రోడ్డుపైకి ప్రవహిస్తోంది. ఒకపక్క అనేక ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నెలకొంటుంటే, ఇక్కడ లీకేజీ వల్ల వేలాది లీటర్ల తాగునీరు వృథాగా మురుగుకాల్వల పాలు కావడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బురద నీటితో రోడ్డు 

పైప్లైన్ లీకేజీ నీటికి తోడు, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో రహదారికి ఇరువైపులా భారీగా బురద నీరు నిలిచిపోయింది. దీనివల్ల దోమలు వ్యాప్తి చెంది డెంగ్యూ, మలేరియా వంటి భయంకరమైన వ్యాధులు వ్యాపించే ముప్పు పొంచి ఉందని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. వాహనాలు వెళ్లేటప్పుడు ఆ బురద నీరు పాదాచారులపై చిందుతుండటంతో తరచూ గొడవలు కూడా జరుగుతున్నాయి.

తక్షణమే అధికారులు స్పందించాలి!

‘ఏడుల్లా బయ్యారం క్రాస్ రోడ్డులో పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం దారుణం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి కుక్క కళేబరాన్ని తొలగించి, భగీరథ పైప్లైన్ లీకేజీకి అడ్డుకట్ట వేయాలి. రోడ్డు ఇరువైపులా నిలిచిన బురద నీటిని తొలగించి, బ్లీచింగ్ పౌడర్ చల్లించి పారిశుధ్య చర్యలు చేపట్టాలి.‘ స్థానిక నివాసితులు, ప్రయాణికులు కోరుకుంటున్నారు.