గృహగణనలో బీసీల ఇళ్లు గాయబ్
దేశవ్యాప్తంగా కులగణన, సామాజిక న్యాయం కోసం డిమాండ్ ఊపందుకుంటున్నది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సమగ్ర కులగణన సర్వే నిర్వహించింది. ఈ సమగ్ర సర్వే లెక్కలను ఇటీవల రాష్ట్ర ప్ర భుత్వం అధికారికంగా విడుదల చేసింది కూ డా. ఈ సర్వే అన్ని రంగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల వెనకబాటును వెల్లడించింది.
రాష్ట్రం లో అత్యధిక శాతం ఉన్న బీసీ సమూహానికి 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉండిపోయింది. దీంతో బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత కల్పించాలని, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో వీటిని చేర్చాలని జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్ ఐఏఎస్ టి.చిరంజీవులు, డాక్టర్ విశారదన్ మహరాజ్, బాలరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో 42 శా తం రిజర్వేషన్ల సాధన సమితి చేపట్టిన ఉద్య మం ఉవ్వెత్తున ఎగిసింది. ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. దీంతో ఈ సారి జనగణనతో పాటు కులగణన చేస్తామ ని కేంద్రం ప్రకటించింది.
కానీ, ఇటీవల జనగణన భాగంగా మొదటి దశలో జరుగుతున్న ఇళ్ల జాబితా, ఇళ్ల గణనలో ఎ స్సీ, ఎస్టీలతో పాటు బీసీ కాలమ్ లేకపోవ డం పలు అనుమానాలకు దారితీస్తోంది. బీ సీలను కూడా ఓసీలతో కలిపి ‘ఇతరులు’గా చూపిస్తున్నారు. ఈ సర్వేలో ప్రతి ఇల్లు, గు డి, బడితో పాటు పశువుల పాకను కూడా గణించాలన్నప్పుడు... బీసీల ఇళ్లను ప్రత్యేకంగా ఎందుకు లెక్కించరు? కేంద్రప్రభుత్వం నిజంగా కులగణనకు కట్టుబడి ఉందా? లేక రాజకీయ ఒత్తిడిని తగ్గించేందుకు మాత్రమే ప్రకటనలు చేస్తున్నదా? అనే అనుమానాలకు ఈ చర్యలు తావిస్తున్నాయి. బీసీల ఇళ్ల ను లెక్కించనప్పుడు 2027 ఫిబ్రవరిలో జ రిగే జనగణనలో బీసీల గణన ఎలా చేస్తారో స్పష్టతనివ్వాలని బీసీ మేధావులు డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికే జనగణనతో పాటు కులగణన చేస్తామని కేంద్ర హోం శాఖ మం త్రి అమిత్ షా అధికారికంగా ప్రకటించారు. కానీ, గెజిట్ నోటిఫికేషన్‌లో మాత్రం ఈ కీలకమైన విషయాన్ని విస్మరించారు. కులగణన అంశాన్ని అందులో చేర్చలేదు. ఈ పరిణామాలను పరిశీలిస్తుంటే... మరోసారి వ్యవ స్థాగతంగా బీసీల హక్కులు కాలరాయబడుతున్నాయా ? అనే అనుమానాలు వ్యక్తమ వుతున్నాయి.
మన దేశంలో ఇప్పటివరకు మతానికి సంబంధించి ఆచార వ్యవహారాల్లో ప్రామాణిక నిర్వచనం లేదు. మొన్నా మధ్య మతం మారిన దళితులకు ఎస్సీ హోదా రద్దు చే స్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై ప లువురి నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. అయినా ప్రస్తుత ఇళ్ల గణనలో ఎస్సీ మతస్థులను లక్ష్యంగా చేసుకునే విధంగా, వారి హక్కులను కాలరాసే విధంగా సర్వే కాలమ్స్ ఉన్నాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి హిందు వు, సిక్కు, బౌద్ధమతానికి చెందినవారైతేనే, వారిని ఎస్సీలుగా గుర్తించాలి. లేదంటే ‘ఇతరులు’ కింద చేర్చాలనే కాలమ్స్ పెట్టారు. కానీ, ఎస్టీలకు సంబంధించి ఏ మతమైనా ఎస్టీ అని రాయడం గమనార్హం. ఇది మత స్వేచ్ఛ, రాజ్యాంగ సమానత్వంపై ప్రశ్నలను లేవనెత్తుతోంది.
ఈ చర్యలు దళితుల పట్ల వివక్షతను నొక్కి చెబుతున్నాయి. మరోవైపు ఈసారి జరిగే గృహ గణనలో ఎన్యూమరేట్‌కు అధిక అధికారాలు కట్టబెట్టారు. ఇంటి యజమాని లేకపోయినా, అతని అనుమతి లేకుండానే 34 కాలమ్స్ నింపడానికి అవకాశం ఇచ్చారు. తద్వారా ఇంటి యజమాని తన హక్కులు కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. 2011 జనాభా లెక్కల్లో ఇంటి వివరాలు నమోదు చేశాక, సదరు ఇంటి యజ మాని వాటిని సరిచూసుకొని సంతకం పె ట్టాల్సి ఉండేది. ప్రస్తుతం డిజిటల్ జనగణనలో దీనికి ఆస్కారం లేదు.
ఎన్యూమరేట్ మాత్రమే సంతకం పెట్టే అవకాశం ఉంది. ఇది డేటా కచ్చితత్వం, పారదర్శకతపై ప్రభా వం చూపుతుంది. స్వీయ గణన చేసుకున్నవారికి ఇలాంటి సమస్యలు రావు. ఇది అం దరికీ సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి ఇంటి యజమానికి తమ సమాచారాన్ని సరిచూసుకొని, నిర్ధారించే అవకాశం కల్పించాలి. నమోదు చేసిన సమాచారానికి సంబంధించిన ఒక నకలు కాపీని ఇంటి యజమానికి అందించాలి. తద్వారా నమోదు చేసిన డేటా పాదర్శకతపై ఇంటి యజమానికి విశ్వాసం కుదురుతుంది.
భారతదేశ ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులు తెలుసుకొని, వారికి ప్రయోజనం కల్పించడానికి జనగణనతో పాటు కులగణన చేయడం అత్యావశ్యకం. కులగణన ద్వా రా దేశ సంపదలో ఎవరి వాటా ఎంతో తెలుస్తుంది. భారతదేశంలో చివరిసారిగా పూర్తిస్థాయి కులగణన 1931లో జరిగింది. అనంతరం 2011లో సామాజిక, ఆర్థిక కులగణన జరిగినా, ఆ డేటా పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి రాలేదు. ఇప్పటి పరిస్థితుల్లో బీసీల జనాభా, వారి ఆర్థిక, -సామా జిక స్థితిగతుల గురించి కచ్చితమైన డేటా లేకపోవడం వల్ల రిజర్వేషన్ల సముచిత పంపి ణీ కష్టమవుతోంది. సంక్షేమ పథకాలు అర్హు ల వరకు చేరడం లేదు. ప్రభుత్వ విధాన నిర్ణ యాలు అంచనాలపై మాత్రమే ఆధారపడుతున్నాయి.
దేశవ్యాప్తంగా దశాబ్దాలుగా రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేయాలని, జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎ స్టీ, ఓబీసీ వర్గాలకు వాటా దక్కాలని వెనుకబడిన వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో కులగణనను సామాజిక న్యాయానికి పునాదిగా పలు వర్గాలు భావిస్తున్నా యి. దేశంలో 90 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరగాలంటే కులగణన తప్ప నిసరి. కానీ, నేడు ఇందుకు విరుద్ధంగా బీసీ కులాల ప్రస్తావన లేకుండానే గృహాల గణన జరుగుతుండటం శోచనీయం. క్షేత్రస్థాయిలో ఇదే జరిగితే ఉద్యమాలు ఉధృతమయ్యే అవకాశాలున్నాయి.
ఇప్పటికే డాక్టర్ విశారదన్ మహారాజ్ సారథ్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఏర్పడి, ఎవరెంతో వారికంత వాటా దక్కాలంటూ ‘మా భూమి’ పోరాటం మొదలైంది. దళిత, బహుజనులంతా ఏకమై ఈ పోరాటంలో భాగం కావాలి. అప్పుడే ఈ దేశంలోని సమస్త భూ మి, సంపద, అధికారంలో దళిత, బహుజనులకు వాటా దక్కు తుంది. ఇది జరగా లంటే ముందుగా రా జ్యాంగబద్ధంగా జరిగే జనగణనతో పాటు కులగణన చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అన్ని వర్గాలను ప్రతిబింబించే విధంగా సమగ్రమైన డేటాను సేకరించాలి. దీనికనుగు ణంగా వనరుల పంపి ణీ జరగాలి. అప్పుడే రాజ్యాంగ సమానత్వ లక్ష్యం నెరవేరుతుంది.
వ్యాసకర్త సెల్: 7989579428
సంపతి రమేష్






