మారుతోంది శ్రమ రూపమే!
ప్రపంచ కార్మిక దినోత్సవం (మే 1) అంటే కేవలం క్యాలెండర్‌లోని ఒక తేదీ కాదు, ఎనిమిది గంటల పనిదినం కోసం, న్యాయమైన వేతనం కోసం, మానవ గౌరవం కోసం ప్రపంచ కార్మిక వర్గం సాగించిన మహోన్నత పోరాటానికి ప్రతీక. శ్రమ కు విలువ ఉండాలని, మనిషి మర యం త్రం కాదని ప్రపంచానికి గుర్తుచేసిన చారిత్ర క దినం.
ఒకప్పుడు కర్మాగారాల్లో యంత్రాల మధ్య కార్మికుడి చెమట చిందేది. ఇప్పుడు డిజిటల్ యుగంలో కంప్యూటర్ స్క్రీన్ ముందు మానవ మేధస్సే పోటీకి దిగుతోంది. అప్ప ట్లో యంత్రాలు మనిషి శారీరక శ్రమకు సవాల్ విసిరితే, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇం టెలిజెన్స్ (ఏఐ) మనిషి మేధోశక్తి, ఉద్యో గ భద్రత, జీవనోపాధి తదితర అంశాలకే కొత్త ప్రశ్నలు వేస్తోంది.
మే డే మనకు కేవలం గత పోరాటాలను గుర్తుచేయడం కాదు, మారుతున్న కాలంలో కార్మిక హక్కుల కొత్త నిర్వచనాన్ని కూడా ఆ లోచింపజేస్తోంది. ఫ్యాక్టరీ కార్మికుడైనా, కాల్ సెంటర్ ఉద్యోగి అయినా, డేటా ఎంట్రీ ఆపరేటర్ అయినా, రైతైనా.. శ్రమ రూపం మా రొచ్చు. కానీ, శ్రమ గౌరవం మారకూడదు. ఈ నేపథ్యంలో కృత్రిమమేధస్సు యుగం ఉద్యోగ ప్రపంచాన్ని ఎలా మలుస్తోంది? కార్మికవర్గ భవిష్యత్తు ఎటువైపు సాగుతోంది? మే డే ఆత్మస్ఫూర్తితో ఈ ప్రశ్న ను పరిశీలించడం అత్యవసరం. గత రెండేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 40 శాతం కంపెనీలు తమ టెక్నాలజీ, కస్టమర్ సపోర్ట్, డేటా నమోదు (డేటా ఎంట్రీ) విభాగాల్లో మనుషుల స్థానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగాన్ని ప్రారంభించాయి. అంతర్జాతీయ కా ర్మిక సంస్థ (ఐఎల్‌వో) నివేదిక ప్రకారం.. 2028 నాటికి సుమారు 8 కోట్ల ఉద్యోగాలు ఏఐ వల్ల పూర్తిగా యంత్రాధారితంగా మారే అవకాశం ఉంది. ఈ గణాంకాలు ఆందోళన కలి గిస్తున్నాయి.
అయితే, నిపుణుల అభిప్రాయం వేరుగా ఉంది. వారి మాటల్లో ఇది పూర్తిగా ఉద్యోగాలను నష్టపోవడం కాదు, ఉద్యోగాలు రూ పాంతరం చెందడం. అంటే పాత పనులు తగ్గినా, కొత్త నైపుణ్యాలతో సరికొత్త అవకాశాలు పెరుగుతాయి. అందుకే ఉద్యోగులు కాలానుగుణంగా తమ సామర్థ్యాలను పెం పొందించుకోవాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ప్రస్తుత అవసరాలకు అనుగుణం గా నైపుణ్యాలను పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.
ఏ రంగంలో ఎంత ప్రభావం?
ప్రపంచంలోనే అత్యధిక ఐటీ ఉద్యోగులు ఉన్న దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. మ న దేశంలో ఐటీకి కేరాఫ్‌గా మారిన బెంగళూరు, హైదరాబాద్, పూణే వంటి నగరాల్లో ఏఐ ప్రభావం ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తోంది. ప్రారంభ స్థాయి ప్రోగ్రామింగ్, డేటా నమోదు, వాయిస్ రికార్డుల లిప్యంతరీకరణ, సాధారణ కంటెంట్ రచన, కస్టమర్ సేవల వంటి పనుల్లో దాదాపు 60 శాతం వరకు ఆటోమేషన్ పెరిగింది. రాబోయే కాలంలో ఇది మరింతగా ఎక్కువయ్యే అవకాశాలు లేకపోలేదు.
ఉదాహరణకు, ఒక ప్రైవేట్ బ్యాంకు ఇటీవల 5,000 కాల్ సెంట ర్ ఉద్యోగాలను తగ్గించి, వారి స్థానంలో ఏ ఐ చాట్‌బాట్‌లను ప్రవేశపెట్టింది. అయితే ఉద్యోగాలు కోల్పోయిన వారిలో 40 శాతం మందికి డేటా విశ్లేషణ, ఏఐ పర్యవేక్షణ, సైబర్ భద్రత రంగాల్లో మళ్లీ శిక్షణ ఇచ్చి ఇతర విభాగాల్లో నియమించారు. ఏఐ యుగంలో వస్తున్న మార్పునకు ఇది సంకేతం. ఉద్యోగ సంక్షోభంలోనూ అవకాశాలు ఉన్నాయని ఈ పరిణామం సూచిస్తోంది.
ఏఐ వల్ల కొత్త ఉద్యోగాలు
ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోవడమే కాదు, కొత్త కొత్త ఉద్యోగాలు కూడా పుట్టుకొస్తున్నాయి. ప్రాంప్ట్ ఇంజినీర్, ఏఐ నైతికత అధికారి, మెషిన్ లెర్నింగ్ ఆపరేటర్, డేటా ట్రైనర్, ఏఐ చట్ట సలహాదారు, రోబోటిక్స్ నిర్వహణ ఇంజినీర్ వంటి పూర్తిగా కొత్త ఉద్యోగాలు ప్రపంచవ్యాప్తంగా పుట్టుకొస్తున్నాయి. భారతదేశంలో ఈ రకం ఉద్యోగాల నియామకాలు వేగంగా పెరుగుతున్నాయి. గత 18 నెలల్లో ఈ రంగాల్లో 35 శాతం వృద్ధి నమోదైంది. నెలకు రూ.70,000 నుంచి రూ.2.5 లక్షల వరకు వేతనాలు అందుతున్నాయి.
కొత్తగా శిక్షణ కార్యక్రమాలు..
భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ప్రతిభావంతుల సమూహంగా ఎదుగుతోంది. సుమారు 50 లక్షల ఐటీ నిపుణుల కోసం ఏఐ సంబంధిత కొత్త శిక్షణా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌డీఎల్) భాగస్వామ్యంతో ‘ఏఐ ఫర్ ఆల్’ కార్యక్రమం కింద 10 లక్షల మందికి శిక్షణ ఇవ్వడానికి రూ.500 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు.
నిపుణుల అభిప్రాయం
నిపుణుల మాటల్లో చెప్పాలంటే మనిషిని ఏఐ పూర్తిగా భర్తీచేయడం సాధ్యం కాదు. కాకపోతే పునరావృత పనులను ఏఐ తగ్గిస్తోంది. భవిష్యత్‌లో సృజనాత్మకత, లోతైన ఆలోచన, భావోద్వేగ అవగాహన కలిగిన ఉద్యోగాలకే ఎక్కువ విలువ ఉంటుంది. అయితే, సాధారణ విద్య కలిగిన మధ్యతరగతి, కార్మిక వర్గ ఉద్యోగుల కోసం ఇది ఒక కీలక మలుపు. సరైన రక్షణ లేకుంటే అసమానతలు మరింత పెరిగే ప్రమాదం ఉంది.
చిన్న పట్టణాలపై ప్రభావం
చిన్న చిన్న పట్టణాల్లో ఏఐ ప్రభావం కొంతమేరకు ఉందన్నది వాస్తవం. చిన్న పట్టణాల్లో డేటా లేబులింగ్, ట్రాన్స్‌క్రిప్షన్, టెలికాలింగ్ వంటి ఉద్యోగాలు తగ్గుతున్నాయి. కానీ, అదే సమయంలో ఏఐ ఆధారిత వ్యవసాయ సలహాలు, టెలీమెడిసిన్, గ్రామీణ డిజిటల్ సేవల వంటి రంగాలు కొత్త ఉపాధి మార్గాలుగా ముందుకొస్తున్నాయి.
భవిష్యత్ దిశగా..
2030 నాటికి కోట్ల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు ఏఐ ద్వారా పుట్టొచ్చు. అదే సమయంలో పాత ఉద్యోగాల స్వరూపం మారిపోవచ్చు. కాబట్టి, ప్రశ్న ఉద్యోగం ఉంటుందా? అన్న ది మాత్రమే కాదు, మన నైపుణ్యం కొత్త ప్రపంచానికి సరిపోతుందా? అన్నది కూడా.
శ్రమ గౌరవం మారకూడదు
శ్రమకు గౌరవం లేకుండా జరిగే అభివృద్ధి అసంపూర్ణం అనేది మే డే మనకు నేర్పిన గొప్ప సత్యం. నేడు ఏఐ యుగంలో కార్మిక లోకం, కార్మిక సంఘాలు కొత్త దిశగా ఆలోచించాలి. ఆ దిశగా ఉద్యమాలు రచించాలి. కేవలం వేతనాల కోసం కాదు, రీస్కిల్లింగ్ హక్కు కోసం, డిజిటల్ భద్రత కోసం, మానవ గౌరవాన్ని కాపాడే విధానాల కోసం కూడా పోరాటాలు చేయడం ఇప్పుడు అవసరం.
ఒకప్పుడు ఎనిమిది గంటల పని కోసం కార్మికులు పోరాడారు. ఇప్పుడు మనిషికి తగిన పని కోసం పోరాడాల్సిన సమయం వచ్చింది. యంత్రాలు వేగంగా పని చేయవచ్చు. కానీ, న్యాయం, బాధ్యత, మాన వత్వం మాత్రం మనిషి చేతుల్లోనే ఉండాలి. ఈ మే డే సందర్భంగా ప్రతి కార్మికుడికి, ప్రతి ఉద్యోగికి, ప్రతి యువతకు ఒక స్పష్టమైన సందేశం ఏమిటంటే కాలం మా రుతోంది, పనుల రూపం మారుతోంది, కానీ శ్రమ విలువ ఎన్నటికీ మారకూడదు, తగ్గకూడదు.
కార్మికుడి చెమటతో నిర్మితమైన ప్రపం చం ఇప్పుడు కృత్రిమ మేధస్సుతో కొత్త దశలోకి అడుగుపెడుతోంది. కానీ, భవిష్యత్ ఎంత ఆధునికమైనా, దాని పునాది మనిషి శ్రమగానే ఉండాలి.
వ్యాసకర్త: జర్నలిస్ట్, 9010128884
కాలగిరి శ్రీనివాస్ రెడ్డి






