13 July, 2026 | 3:47 PM

కర్ణాటక సీఎం డీకే వ్యాఖ్యలపై భానుప్రకాశ్ రెడ్డి ఫైర్

13-07-2026 02:45 PM

శ్రీవారి మొదటి హారతిపై కర్ణాటక సీఎం వ్యాఖ్యలపై భానుప్రకాశ్ రెడ్డి అభ్యతరం

తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రం.. డీకే క్షేత్రం కాదు: భాను ప్రకాశ్ రెడ్డి

తిరుమల: తిరుమల శ్రీవారి మొదటి హారతిపై కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్(Karnataka CM DK comments) వ్యాఖ్యలపై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి(Bhanuprakash Reddy) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తిరుమలలో శ్రీవారి నిత్యహారతి దర్శనం మంత్రులు, ఎమ్మెల్యేలకు అవకాశం కల్పిస్తామని  కర్ణాటక సీఎం ప్రకటన చేశారు. వీఐపీలకు అవకాశం కల్పించేలా ఉత్తర్వులు ఇస్తామని డీకే పేర్కొన్నారు. శ్రీవారి తొలి హారతి(Srivari Harathi) కర్ణాటక ప్రతినిధి తీసుకోవడం ఆనవాయితీ అని భానుప్రకాశ్ రెడ్డి వెల్లడించారు.

మైసూర్ మహారాజుపై(Mysore Maharaja) గౌరవంతో ఈ సంప్రదాయం వచ్చిందని గుర్తుచేశారు. రాజకీయ నాయకుల కోసం తొలి హారతి సంప్రదాయం పెట్టలేదన్నారు. శ్రీవారి సన్నిధిని రాజకీయ క్షేత్రంగా మార్చవద్దని హితవు పలికారు. టీటీడీ ధర్మకర్తల మండలి భేటీలో(TTD Trust Board Meeting) ఈ అంశంపై చర్చిస్తామని భానుప్రకాశ్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రం.. డీకే శివకుమార్ క్షేత్రం కాదని హెచ్చరించారు. డీకే శివకుమార్ చెప్పినట్లు టీటీడీ చేసే పరిస్థితి ఉండదని సూచించారు. డీకే శివకుమార్ ఇష్టానుసారం ప్రకటనలు చేయడం సరికాదని చురకలంటించారు. కర్నాటక తరహాలో మిగతా రాష్ట్రాలూ అడిగే అవకాశం ఉందని తెలిపారు. చేసిన ప్రకటనను డీకే శివకుమార్ తక్షణమే ఉపసంహరించుకోవాలని భాను ప్రకాశ్ రెడ్డి సూచించారు.